మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఈ యువ దర్శకుడితో కలిసి పని చేస్తానని అధికారికంగా వెల్లడించినప్పుడు చాలా ఉత్సాహంగా కనిపించారు.
అయితే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. వర్ధమాన దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమా కోసం రికార్డు స్థాయిలో దాదాపు 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
ఈ వార్త తెలిసిన తరువాత ఇండస్ట్రీ వర్గాలు షాక్ కు గురవుతున్నాయి. ఇది నిజంగా అందరికీ ఆశ్చర్యం కలిగించే వార్త, ఎందుకంటే దర్శకుడు బుచ్చిబాబు కేవలం ఒక సినిమా మాత్రమే చేసిన దర్శకుడు మరియు అతనికి ఈ రేంజ్ లో భారీ పారితోషికం ఇవ్వడం ఒక అద్భుతం లాంటిది.
బుచ్చి బాబు మొదటి సినిమా ఉప్పెన భారీ బ్లాక్ బస్టర్ సాధించిన సంగతి తెలిసిందే కానీ రామ్ చరణ్ సినిమాకు 15 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడం అంటే అది భారీ మొత్తం అనే చెప్పాలి. కాగా రెమ్యునరేషన్ లో 1/3 వంతును బుచ్చిబాబుకు అడ్వాన్స్ గా ఇవ్వనున్నట్లు సమాచారం.
తన తొలి చిత్రం ఉప్పెన కోసం కూడా బుచ్చిబాబుకు మంచి రెమ్యునరేషన్ లభించిందని, ఆ సినిమా విజయం తరువాత మైత్రి బృందం అతనికి బెంజ్ కారు మరియు ఖరీదైన ఫ్లాట్ ను బహుమతిగా ఇచ్చిందని వినికిడి.
బుచ్చిబాబుకు ఈ గుర్తింపు రావడానికి ప్రధాన కారణం దర్శకుడు సుకుమార్ అని అంటున్నారు. సుకుమార్ అతన్ని నమ్మి, బుచ్చిబాబు సినిమాల్లో కూడా పాలు పంచుకోవడంతో నిర్మాతలకు యువ దర్శకుడిపై అపారమైన నమ్మకం కలిగింది.
రామ్ చరణ్ తో బుచ్చి బాబు తెరకెక్కించే చిత్రం చాలా భారీ ప్రాజెక్ట్ అని అంటున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడవుతాయి.