తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లకు ఉన్న స్టార్ ఇమేజ్ గురించీ, వారి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద కొల్లగొట్టిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి కొత్త దర్శకుడి అభిమాన హీరోల లిస్ట్ లో వాళ్లిద్దరూ ప్రథమ స్థానంలో ఉంటారనేది అతిశయోక్తి కాదు.
ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా పాపులర్ అయిన దిల్ రాజుకే పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టింది. ఎన్నో సంవత్సరాల పాటు వేచి చూసిన ఆయనకు ‘వకీల్ సాబ్’ సినిమాతో నిర్మించే అవకాశం దక్కింది. ఆ చిత్ర ప్రచార కార్యక్రమాల సమయంలో దిల్ రాజు ఒక అగ్ర నిర్మాతగా కాకుండా ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా ప్రవర్తించారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి తో పని చేసే అవకాశం మాత్రం ఇంకా దిల్ రాజు కు దక్కలేదు. దాదాపు పదేళ్ల పాటు చిరంజీవి సినిమాలకు దూరంగా ఉండటం ఒక కారణం అయితే, 2017 లో ఖైదీ.నో.150 తో తిరిగి వచ్చిన తరువాత ఆయన ఎక్కువగా సొంత నిర్మాణంలో.. లేదా అనుబంధ సంస్థల తోనే పని చేయడం మరో కారణం.ఇక ఇన్ని రోజులు ఓపికగా ఎదురు చేసిన దిల్ రాజు.. ఎలాగైనా మెగాస్టార్ తో సినిమా తీయాలని ఏకంగా చిరంజీవి కోసం ఆరు కథలు సిద్ధం చేసుకుని పెట్టారట.
ప్రస్తుతానికి చిరంజీవి షెడ్యూల్ బీజీగా ఉంది. 2024 వరకూ ఆయన క్యాలెండర్ ఫుల్ గా ఉన్నా కూడా దిల్ రాజు తన ప్రయత్నాలు మాత్రం గట్టిగా చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే ఆరు కథల్ని సిద్దం చేయించి వాటిని చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారట. వాటిలో ఏ కథ నచ్చితే ఆ కథతో వెంటనే సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి దిల్ రాజు ఆశని మెగాస్టార్ చిరంజీవి నేరవేరుస్తారా లేరా తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.