ధనుష్ హీరోగా నటించిన తాజా చిత్రం సార్ (వాతి) చిత్ర యూనిట్ తమ సినిమా పై చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఇండస్ట్రీ వర్గాల కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ షో నుండి సినిమాకి అద్భుతమైన స్పందన వచ్చిందని అంటున్నారు. కాగా ఈ చిత్రానికి రేపు రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ వేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
ఒకవేళ ఈ ప్లాన్ గనక అనుకున్నట్టు విజయం సాధిస్తే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడానికి ఆ ప్రీమియర్ టాక్ ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజు సాయంత్రం లోగా దీనికి సంభందించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
తమిళ స్టార్ హీరో ధనుష్ తన తదుపరి చిత్రం వాతి/సార్ పై ఆయనతో పాటు అభిమానులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటైన ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా మూడు రోజుల సమయం ఉంది. పైన చెప్పినట్టుగా సినిమాకి ఇండస్ట్రీ వర్గాల నుంచి పాజిటివ్ రివ్యూలు వినబడుతున్నాయి.
వాతి/సార్ లో ధనుష్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ అయిన బాలా పాత్రలో కనిపిస్తారు. బాలా మరియు అతని సహోద్యోగి మీనాక్షి (సంయుక్త) మధ్య రొమాన్స్ కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన భాగంగా ఉంటుందని ట్రైలర్ సూచించింది. విలన్ పాత్రలో విద్యను వ్యాపారంగా చూసే సముద్రఖని కనిపించనున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ ముఖ్యమైన సమస్యను ప్రస్తావించనున్నట్లు సమాచారం.
ధనుష్ తో పాటు తెలుగులో బింబిసార, భీమ్లా నాయక్, మలయాళంలో కడువా వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన సంయుక్త కూడా ఈ సినిమాలో నటించారు. సముద్రఖని, తనికెళ్ల భరణి, పి.సాయికుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.
తొలిప్రేమ, మిస్టర్ మజ్ను చిత్రాల ఫేమ్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ సినిమాలో తనకు ఓ ముఖ్యమైన పాత్ర దక్కిందని ఆవిడ తెలిపారు. ఫిబ్రవరి 16, 2023న జరగబోయే సార్/వాతి ప్రీమియర్ షోలలో సినిమాకు పాజిటివ్ గా టాక్ రావాలని కోరుకుందాం.