ధనుష్ తాజా ద్విభాషా చిత్రం సార్ (వాతి) చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ దాటింది. ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఇక ఆ పాజిటివ్ రెస్పాన్స్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయంగా అభివృద్ధి చెందింది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటించిన ‘వాతి’ చిత్రం ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదలైంది. తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో సార్ పేరుతో విడుదలైంది. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా, సముద్రఖని ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో సాయికుమార్, తనికెళ్ల భరణి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
ఇప్పటి వరకు మంచి రన్ సాధించిన ఈ సినిమా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో కొత్త సినిమాలు వరుస పరాజయాలు చవిచూడటంతో ఈ వీకెండ్ లోనూ మంచి ప్రదర్శన కొనసాగించనుంది. దర్శకుడు వెంకీ అట్లూరి ఇదివరకూ ప్రేమకథలకు పెట్టింది పేరే కానీ ఈసారి సీరియస్ ఇష్యూను హ్యాండిల్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
వాతి/సార్ యొక్క కథ 90వ దశకంలో సాగుతుంది. ఈ సినిమాలో ధనుష్.. కార్పొరేట్ వ్యాపారులకు వ్యతిరేకంగా పోరాడే ఒక ప్రొఫెసర్ గా, నిరుపేద, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విజయం సాధించాలని వారికి అండగా నిలబడే పాత్రలో కనిపిస్తారు. విద్య ప్రైవేటీకరణలో లోపాల పై ఈ చిత్రం దృష్టి సారించింది. జీవీ ప్రకాశ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. త్వరలోనే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ గా కూడా విడుదల కానుంది.
ప్రస్తుతం ధనుష్ అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త్రిభాషా చిత్రంలో కూడా నటించనున్నారు. ఇక ధనుష్ తన 50వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు కొన్ని వారాల క్రితం అధికారికంగా ప్రకటించారు. ధనుష్, ఎస్.జె.సూర్య, విష్ణు విశాల్, కాళిదాస్ జయరామ్, దుషారా విజయన్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారని అంటున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘రాయన్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.