సెప్టెంబర్ 29న, ధనుష్ సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన నానే వరువేన్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ధనుష్ మరియు సెల్వ కాంబినేషన్లో ఇది అయిదవ చిత్రం కావడం విశేషం. ఇంతకు ముందు తుళ్లువదో ఇలామై, కాదల్ కొండేయిన్, పుదుపేట్టై మరియు మయక్కం యెన్నా సినిమాలకు ఈ అన్నదమ్ములిద్దరూ కలిసి పనిచేశారు. ఈ చిత్రం తాజాగా ఓటీటీలో విడుదలైంది.
ఒకేలా ఉండే కవల సోదరులైన ప్రభు మరియు కదిర్ ల జీవితం ఆధారంగా ఈ సినిమా కథ రూపొందించబడింది. ప్రభు అందరూ ఇష్టపడే స్వభావం ఉన్న వాడు అయితే, కదిర్ మాత్రం ఎప్పుడూ తన ప్రవర్తన వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాడు. అతనిని ఎప్పటికప్పుడు సరిదిద్దడానికి ప్రయత్నించి విసుగు చెందిన అతని తండ్రి కోపం చూపిస్తూ ఉంటాడు. ఒకసారి కదిర్ పక్కింటి పిల్లవాడిపై దాడి చేసినప్పుడు, అతని తండ్రి కదిర్ ను పెరట్లోని చెట్టుకు బంధిస్తాడు.
ఆ తర్వాత కథాంశం ప్రభు జీవితం వైపు వెళుతుంది. తన కుటుంబానికి అన్నింటికంటే ఎక్కువ విలువనిచ్చే సాధారణ వ్యక్తి ప్రభు. అతని కుమార్తె సత్యకు ఒక చిన్న పిల్లవాడి దెయ్యం పట్టడంతో, అతని జీవితం పూర్తిగా తలకిందులవుతుంది. కదిర్ కి సత్యకి పట్టిన దెయ్యానికి సంబంధం ఏమిటి? సత్యని ప్రభు కాపాడగలడా? అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.
కోడి, పట్టాస్ తర్వాత ధనుష్ మూడోసారి ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. నానే వరువేన్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో లో తెలుగు తమిళ భాషల్లో ప్రసారం అవుతోంది.
తమిళ చిత్ర పరిశ్రమలో ధనుష్ సినిమాలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. నిజానికి అతనికి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నట్లు అనిపించకపోయినా.. టాక్ బాగుంటే మటుకు ధనుష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని అద్భుతాలు చేస్తాయి. అలాగే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ధనుష్ తన నటనతో వంద మార్కులు కొట్టేస్తారు. ధనుష్ నటించిన నానే వరువేన్ కంటే ముందు తిరుచిత్రంబలం విడుదలైంది. కాగా ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా తిరు అనే టైటిల్‌తో విడుదలైంది. తిరు సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం ధనుష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సర్/వాతి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్‌గా విడుదల కానుంది. ఈ సినిమాని ప్యాన్ ఇండియా రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక సినిమా అనౌన్స్ చేసినా ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. బహుశా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అంతర్గత చర్చలు జరుగుతున్నాయి కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.