ధనుష్ నటించిన తాజా ద్విభాషా చిత్రం సార్ కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్‌ని అందుకుని అందరినీ ఆశ్చర్య పరిచింది. తెలుగులో సార్, తమిళంలో వాతిగా విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలతో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ తర్వాత మరింత పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.
తొలి రోజు గ్రాస్ కలెక్షన్స్ లో బాక్సాఫీస్ వద్ద 5 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సార్ సంచలన విజయం సాధించింది. ఇక రెండో రోజు శివరాత్రి పండగ కావడంతో ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఓపెనింగ్ డే కలెక్షన్స్ కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ కలెక్ట్ చేసింది అంటే అది ఎల్లప్పుడూ సినిమాకు సానుకూల సంకేతం అనే చెప్పాలి.
తెలుగు రాష్ట్రాల్లో సార్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 5 కోట్లు మాత్రమే. అంటే ఈ సినిమా ఇప్పటికే ఆ మార్కును చాలా సునాయాసంగా దాటేసింది. బ్రేక్ ఈవెన్ స్టేటస్ సాధించిన తర్వాత ఇప్పుడు బ్లాక్ బస్టర్ స్టేటస్ దిశగా పయనిస్తోంది. తిరు, సార్ వంటి సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తుండటంతో ధనుష్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నట్లు కనిపిస్తుంది.
నిజానికి సార్ ఓపెనింగ్ కలెక్షన్స్ తాజాగా తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించగా సంక్రాంతి సీజన్ లో విడుదలైన ‘వారసుడు’ కంటే ఎక్కువ ఉండటం ట్రేడ్ పండితులను సైతం అవాక్కయ్యేలా చేసింది.
ధనుష్ తో పాటు సంయుక్త మీనన్, సముద్రఖని, హైపర్ ఆది, సాయి కుమార్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు