భారతీయ చిత్రసీమలోని అత్యుత్తమ నటుల్లో తమిళ నటుడు ధనుష్ కూడా ఒకరు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సహజసిద్ధమైన పాత్రలు, సినిమాలు చేసి మెప్పించడంలో ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి. కేవలం తమిళ భాషకే పరిమితం కాకుండా.. అత్యంత ప్రశంసనీయమైన కోన్ని హిందీ చిత్రాలలో కూడా భాగమయ్యారు. అంతటితో ఆగకుండా ఇటీవలే ఏకంగా హాలీవుడ్ ఆఫర్ ను కూడా అందుకున్నారు. హాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన అవెంజర్స్ సినిమాల రచయితలైన రుస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించిన ది గ్రే మ్యాన్‌లో ఒక అతిధి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.
అయితే ధనుష్ కు నటుడిగా ఎంత పేరున్నా.. బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే, ధనుష్ పేరు మీద భారీ రికార్డులు కానీ అసాధారణమైన ఫిగర్స్ నమోదు చేసిన చిత్రాలు లేవనే చెప్పాలి. గతంలో ధనుష్ నటించిన విఐపీ (తెలుగులో రఘువరన్ బీ టెక్), అసురన్ మరియు కర్ణన్ వంటి సినిమాలు హిట్ అయినా, వాటిలో ఏవీ బ్లాక్‌బస్టర్ విజయాల స్థాయిలో ఆడలేదు. అందువల్లే ఇప్పటి వరకు ఆయన సినిమాల్లో ప్రతిష్టాత్మకమైన 100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలేవీ లేవు.అయితే తాజాగా ధనుష్ నటించిన తిరుచిత్రంబళం సినిమాతో ధనుష్ 100 కోట్ల కల తీరింది.
ధనుష్ ప్రధాన పాత్రలో, నిత్య మీనన్, భారతీరాజా, ప్రకాష్ రాజ్ మరియు రాశి ఖన్నా నటించిన తిరుచిత్రంబళం సినిమా ఓపెనింగ్ రోజునే అద్భుతమైన వసూళ్లను సాధించింది. ఇక ప్రేక్షకుల నుండి పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో, సినిమా వేగం ఏమాత్రం తగ్గకుండా మరింత పుంజుకుంది. ఆ తరువాత కలెక్షన్లు ఆకాశాన్ని తాకాయి అంటే అతిశయోక్తి కాదు. ధనుష్ సినిమాల్లో ఇదే అత్యధికమైన వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
తిరుచిత్రంబళం విడుదలై రెండు వారాలు పైనే కావస్తున్నా ఇప్పటికీ థియేటర్లలో ఏ ఆటంకం లేకుండా విజయవంతంగా నడుస్తోంది. ఇది మరో వారం పాటు తన రన్ ను కొనసాగిస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. కాగా ఈ చిత్రంతో, బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల మార్క్‌ను సాధించిన తమిళ నటుల అరుదైన లిస్ట్‌లోకి ధనుష్ ప్రవేశించారు.