ఈ సంవత్సరం ప్రారంభంలో తమిళ స్టార్ ధనుష్, ఆయన భార్య.. ప్రముఖ తమిళ సినీ దర్శకురాలైన ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు తీసుకోవాలనే నిర్ణయం తెలిపి తమ అభిమానులను ఆందోళనకు గురిచేశారు. ఈ జంట ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనల ద్వారా విడుదల చేశారు. అభిమానులు తమ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడవద్దని, ఈ విషయం పై గోప్యతను పాటించాలని అభ్యర్థించారు.
సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. ఇటీవలే తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో అందమైన జంటగా పేరున్న నాగ చైతన్య – సమంత విడిపోయిన సంగతి తెలిసిందే. కొందరు మాత్రం అలాగే దశాబ్ధాల పాటు తమ వివాహ బంధాన్ని కొనసాగిస్తూ ఎందరో దంపతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
2003లో రజనీకాంత్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్యను ధనుష్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. విడాకులకు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో పిల్లలిద్దరూ ధనుష్ వద్దే ఉంటున్నారు. అయితే ఏమైందో తెలియదు గానీ… కోర్టులో దరఖాస్తు చేసిన విడాకులను రద్దు చేసుకోవాలని ధనుష్, ఐశ్వర్యలు నిర్ణయం తీసుకున్నట్లుగా బుధవారం వార్తలు వచ్చాయి. ఈ వార్తల పై అటు ధనుష్ – ఐశ్వర్యలను జంటగానే చూడాలని ఆశిస్తున్న వారి అభిమానులు.. అలాగే రజనీ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఒక రకంగా సంబరాలు చేసుకుంటున్నారు.
ఇటీవలే ఇరు కుటుంబాలు సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసంలో సమావేశమయ్యారని.. అక్కడ ఈ జంట తమ మధ్య ఉన్న సమస్యలను, మనస్పర్థలను తొలగించుకుని తమ వివాహ బంధాన్ని తిరిగి కొత్తగా అరంభించడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
అయితే ఈ వార్తల పై అటు ధనుష్ నుంచి కానీ, ఇటు ఐశ్వర్య నుంచి కానీ ఎలాంటి స్పందనా లభించలేదు. అందువల్ల ఈ వార్తలలో ఎంత నిజం ఉంది అన్న పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ధనుష్ ఐశ్వర్యలు నిజంగా మళ్ళీ కలిస్తే అది అందరూ ఆనందించే విషయమే కదా. మరి ఆ వార్త నిజం అవ్వాలనే కోరుకుందాం.