భోళా శంకర్ తర్వాత చిరంజీవి తన తదుపరి సినిమా కోసం ఏ స్క్రిప్ట్ ను ఫైనల్ చేయలేదు, ఏ దర్శకుడినీ ఓకే చేయలేదు. వెంకీ కుడుముల, మరి కొంత మంది దర్శకులతో చర్చలు జరిపినా ఇంతవరకు ఏదీ కార్యరూపం దాల్చలేదు. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ధమాకా దర్శకుడు త్రినాథరావు నక్కినతో చిరంజీవి ఓ సినిమా కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకులతో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్, బాబీ, మోహన్ రాజా వంటి వారితో ఆయన పనిచేశారు, చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి ఒక ప్రతిభావంతుడైన యువ దర్శకుడితో పని చేయనున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం.
రవితేజ ధమాకా సినిమా చూశాక చిరంజీవి దర్శకుడు త్రినాథరావుకు ఫోన్ చేశారని, వారిద్దరూ ఒక ప్రాజెక్ట్ గురించి కూడా చర్చించారని సమాచారం. త్రినాధ్ రావు ఇప్పటికే మెగాస్టార్ కి సరిపోయే ఓ లైన్ పై వర్క్ చేశారని, అందుకు తగ్గట్లుగా చిరంజీవి ఫుల్ స్క్రిప్ట్ అడిగారని సమాచారం.
త్రినాథరావు చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉంటూ బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ హిట్స్ తో మంచి సక్సెస్ ఫుల్ కెరీర్ ను సొంతం చేసుకున్నారు. రవితేజతో ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ధమాకా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. త్రినాథరావు, చిరంజీవి కాంబినేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఎందుకంటే ఇద్దరూ కమర్షియల్ ఎంటర్ టైనర్ ను చాలా బాగా హ్యాండిల్ చేయగలరు.
మరో వైపు చిరంజీవి తమిళ సూపర్ హిట్ వేదాళం రీమేక్ భోళా శంకర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తో 2013లో విడుదలైన షాడో తర్వాత దర్శకుడిగా వెండితెరకు రీఎంట్రీ ఇవ్వనున్నారు.