ప్రదీప్ రంగనాథన్! నటుడిగా మారిన ఈ యువ దర్శకుడు తాజా చిత్రం “లవ్ టుడే” బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ కోలీవుడ్ బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. ఇప్పటికే 40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషం.
టైర్ 2 హీరోలకు కూడా ఈ నంబర్ చాలా పెద్దది. ఇటీవల విడుదలైన విక్రమ్, సూర్య, శివ కార్తికేయన్‌ల స్టార్‌డమ్‌ను అధిగమించిన ఈ సినిమా మంచి కంటెంట్ స్టార్ల కంటే ఎక్కువ శక్తివంతమైనదని మరో సారి నిరూపించింది. యూత్ ప్రేక్షకులు క్రేజీగా ఈ సినిమాకి కనెక్ట్ అయిపోతున్నారు.
తమిళ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన టైర్ 2 హీరోల కలెక్షన్లను ఈ సినిమా క్రాస్ చేయబోతోంది. ఇది రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ లేదా శంకర్ వంటి టైర్ 1 స్టార్ల సినిమాల కంటే కొంచెం తక్కువగా ఉండవచ్చు. అలాంటి ప్రభావం చూపించడం కూడా సినిమాకి గౌరవమే కదా.
ఈ సినిమా టాలీవుడ్ లో గత సంవత్సరం విడుదలై ఘన విజయం సాధించిన ఉప్పెన లాంటిదని ట్రేడ్ వర్గాల వారు భావిస్తున్నారు. తొలి చిత్రంతో ఒక హీరో యూత్‌ఫుల్ కంటెంట్‌తో రికార్డులను బద్దలు కొట్టడం చాలా అరుదుగా జరుగుతోంది. ఏ పరిశ్రమలోనైనా ఇది అరుదైన ఘనతే. ఒక సినిమా విజయవంతం అవ్వాలి అంటే కంటెంట్ ఏ కింగ్ అని మరోసారి రుజువు చేసింది.
ఈ సినిమాకి దర్శకుడిగా కూడా పని చేసిన ప్రదీప్ రంగనాథన్ సినిమా సక్సెస్‌లో డబుల్ క్రెడిట్ కొట్టేశారు. ఈ నూతన నటుడు గతంలో జయం రవి, కాజల్ అగర్వాల్ జంటగా కోమలి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.
తమిళ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న తర్వాత, లవ్ టుడే తెలుగులోకి డబ్బింగ్ వెర్షన్‌గా విడుదల కానుంది. అయితే, మహేష్ బాబు తండ్రి, ప్రముఖ నటుడు కృష్ణ దురదృష్టవశాత్తు మరణించిన కారణంగా నవంబర్ 15 న విడుదల కావాల్సిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా ట్రైలర్ వాయిదా పడింది. ఈరోజు నవంబర్ 17న ఉదయం 10 గంటలకు తెలుగు ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ విడుదల చేశారు.
తెలుగు వెర్షన్ విడుదల తేదీని నిర్మాతలు ఇంకా ప్రకటించలేదు. మొదట్లో, వారు నవంబర్ 18న ఈ సినిమాని విడుదల చేయాలని చూశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు యొక్క శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లవ్ టుడే తెలుగు వెర్షన్‌ను పంపిణీ చేయనుంది.