నానికి, ఆయన తాజా చిత్రం దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకి మధ్య అంతా సవ్యంగా లేదన్నట్లుగా కనిపిస్తుంది. దసరా సినిమా తాలూకు ప్రమోషనల్ ఈవెంట్స్ లో నాని సినిమాను, దర్శకుడిని పొగడ్తలతో ముంచెత్తడంతో పాటు తప్పకుండా ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందని చాలా కాన్ఫిడెంట్ స్టేట్ మెంట్స్ ఇచ్చారు.
అయితే దసరా సినిమాలో కొన్ని సన్నివేశాలకు మెరుగులు దిద్దే ప్రయత్నంలో రీషూట్ కోసం మరో 10 రోజులు కాల్షీట్లు కావాలని దర్శకుడు నానిని అడిగారని, అయితే దర్శకుడి అభ్యర్థనను నాని తిరస్కరించారని, దీంతో దర్శకుడు శ్రీకాంత్ అసంతృప్తికి గురయ్యారని వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ శ్రీకాంత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అయితే ఇప్పటి వరకు షూట్ చేసినవి సరిపోతాయని, సినిమాలో రీషూట్ చేయడానికి ఏమీ లేదని నాని చెప్పినట్లు సమాచారం. గతంలో కూడా ఈ నాచురల్ స్టార్ దసరా సాంగ్ షూట్ ఫుటేజ్ ను నిర్ణీత సమయం కంటే ముందే లీక్ చేసిన సందర్భంలో శ్రీకాంత్ ఓదెలకి నాని ఉత్సాహం నచ్చక కాస్త ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది.
సాధారణంగా యువ దర్శకులు తమ మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. తమ టాలెంట్ ని పూర్తి సామర్థ్యంతో ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి తమ ఆలోచనలకు అనుగుణంగా ఏదైనా జరగకపోతే నిరాశ చెందుతారు. మరి నాని, శ్రీకాంత్ ఓదెల మధ్య ఉన్న విభేదాలు త్వరలోనే సమసిపోతాయని ఆశిస్తున్నాం.
నాని తన ట్యాగ్ కి తగ్గట్టు తెర పై నేచురల్ పెర్ఫార్మెన్స్ కు పెట్టింది పేరు. దసరా సినిమాలో తన కెరీర్ లో తొలిసారి హై ఆక్టేన్ మాస్ రోల్ చేస్తుండటంతో ఆయన అభిమానులే కాదు నాని కూడా దసరా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.