క్లాసిక్ లవ్ ఎంటర్ టైనర్ గా పేరు పొంది మరియు బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా ప్రేమికుల రోజు స్పెషల్ గా ఫిబ్రవరి 14న రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాను కేవలం ఒక్క రోజు మాత్రమే రీరిలీజ్ లాగా చేస్తున్నారు. ఈ అందమైన చిత్రాన్ని మరోసారి వెండితెర పై వీక్షించడానికి సినీ ప్రియులకు ఇదొక అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇక అప్పుడు ఈ సినిమాని థియేటర్లో చూడని వారు ఈసారి చూడచ్చు.
సిద్ధార్థ్, త్రిష కృష్ణన్, శ్రీహరి ప్రధాన పాత్రల్లో నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఈ సినిమాతో ఒక్కసారిగా సిద్ధార్థ్, త్రిష యూత్ ఆడియన్స్ కి ఫేవరెట్స్ గా మారగా, దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్ట్ లో ఇప్పటికీ ఉంటాయి.
ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 9 భారతీయ భాషల్లో రీమేక్ చేశారు. ఈ సినిమాకు తొమ్మిది సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ , ఐదు నంది అవార్డులు వచ్చాయి. ఎం.ఎస్.రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పైన చెప్పినట్టు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది.
ఎన్నో ప్రత్యేక సందర్భాల్లో పాత బ్లాక్ బస్టర్ సినిమాలు మళ్ళీ విడుదల అవుతుండటంతో రీరిలీజ్ ల ట్రెండ్ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఒక అలవాటుగా మారింది. ఈ ట్రెండ్ రీ రిలీజ్ లో అద్భుతమైన వసూళ్లు సాధించిన పోకిరి సినిమాతో మొదలైంది. ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాలే కాకుండా చిన్న సినిమాలు కూడా రీ రిలీజ్ అవుతున్నాయి.