హను రాఘవపూడి తెరకెక్కించిన మ్యాజికల్ లవ్ స్టొరీ సీతా రామం ఈ సంవత్సరంలో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఓ వైపు ప్రేక్షకులు మరియు విమర్శకులు ఈ చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తగా.. మరో వైపు బాక్సాఫీస్ వద్ద కూడా అద్భుతంగా లాంగ్ రన్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఏ ప్రేమకథకైనా కావాల్సింది హీరో – హీరోయిన్ల జోడీ చక్కగా కుదరడం.. వీనుల విందైన సంగీతం. సీతా రామంలో దుల్కర్, మృణాల్ ఇద్దరూ తమ నటన మరియు కెమిస్ట్రీని సీతారాములుగా వారిని తప్ప మరెవ్వరినీ ఊహించలేనంతగా పండించారు. ఇక విశాల్ చంద్రశేఖర్ సంగీతం కూడా శ్రావ్యంగా ఉండి ఒక్కో పాట ఒక్కో అద్భుతంగా, నేపథ్య సంగీతం కూడా సినిమాకి ప్రాణంలా నిలిచింది.
ఇక ముందుగానే చెప్పుకున్నట్లు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ యుద్ధం రాసిన ప్రేమకథ ప్రతి ప్రాంతంలోనూ గొప్ప విజయాన్ని సాధించింది. పంపిణీదారులు మరియు ఎగ్జిబిటర్‌లకు భారీ లాభాలను సంపాదించి పెట్టింది.
కాగా సీతా రామం సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ మార్కుకు కేవలం కొద్ది అడుగుల దూరంలో ఉంది. హిందీ కలెక్షన్లతో కలిపి 22 రోజుల వరకు ఈ చిత్రం మొత్తంగా 96 కోట్ల మొత్తాన్ని వసూలు చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ రిలీజ్ ను నిర్మాతలు గనక మరి కొన్ని రోజులు ఆలస్యం చేసుంటే ఈ చిత్రం మ్యాజికల్ 100 కోట్ల మార్క్‌ను అవలీలగా సాధించేది. హిందీ కలెక్షన్లు ఇప్పటి వరకు 8 కోట్ల వరకు వచ్చాయి. ఇక వంద కోట్ల మైలురాయిని చేరుకోవడానికి ఈ చిత్రం మరో 4-5 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది.
సీతా రామం యొక్క ఏరియాల వారీ కలెక్షన్స్ ఎలా వచ్చాయంటే.. తెలుగు రాష్ట్రాలలో – 44 కోట్లను వసూలు చేయగా.. కేరళలో – 8 కోట్లు, తమిళనాడులో – 13 కోట్లు, హిందీ – కర్ణాటక కలిపి 15 కోట్లు, ఓవర్సీస్లో 16 కోట్లు.. మొత్తంగా అన్ని ఏరియాల వసూళ్లు కలుపుకుని 96 కోట్ల భారీ ఫిగర్ ను సాధించింది.
హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అగ్ర నిర్మాత అశ్విని దత్ నిర్మాణ సారథ్యం వహించారు. ఈ సినిమాలో రష్మిక మందన్న, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో నటించారు. దుల్కర్ మరియు మృణాల్ అద్భుతమైన కెమిస్ట్రీ, అబ్బురపరిచే విజువల్స్, భావోద్వేగాలతో కట్టి పడేసే కథ, పాత్రలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంలో చిత్రానికి ఎంతగానో సహాయపడ్డాయి.