మెగాస్టార్ చిరంజీవి కేవలం స్టార్ గానో, నటుడిగానో మాత్రమే కాదు, ఒత్తిడికి గురై కష్టాల్లో ఉన్న నిరుపేదలకు సాయం చేయడంలో కూడా ఎప్పుడు ముందుంటారనే విషయం తెలిసిందే. ఎంతో మంది ఆర్టిస్టులకు, తన అభిమానులకు సాయం చేస్తూ చిరంజీవి తన పెద్ద మనసును చాలాసార్లు చాటుకున్నారు. కాగా మరోసారి చిరంజీవి తన పెద్ద మనసును బలగం మొగిలయ్యకు సాయం చేసి చాటుకున్నారు.
ప్రముఖ కమెడియన్ వేణు.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన బలగం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. సినిమా చివర్లో టాలెంటెడ్ ఆర్టిస్ట్ మొగిలయ్య సినిమాలోని క్లైమాక్స్ సాంగ్ తో ఫేమస్ అయ్యారు. అయితే మొగిలయ్య కిడ్నీ సమస్యలతో బాధపడుతుండటంతో పాటు కంటిచూపు కూడా క్షీణించిందట.
బలగం మొగిలయ్య తీవ్ర అనారోగ్యం పాలై హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారట. ఆయన రెండు కిడ్నీలు దెబ్బ తినడం, డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్ వంటి తీవ్ర సమస్యలతో కంటి చూపు కూడా కోల్పోయారట. టాలీవుడ్‌లో ఎవరైనా ఆపదలో ఉన్నా కూడా నేనున్నాను అంటూ ప్రత్యక్షమయ్యే చిరంజీవి ఈ సారి కూడా తన అభయ హస్తాన్ని చూపించారు. మొగిలయ్య కి తిరిగి కంటి చూపు వచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారు చిరంజీవి.
“బలగం” డైరెక్టర్ వేణుకి ఫోన్ చేసి మొగిలయ్య కంటి చూపు కోసం ఎంత ఖర్చైనా తాను భరిస్తానని ఆయనకు కంటి చూపు వచ్చేలా చేస్తానని చెప్పి భరోసా ఇచ్చారట. ఈ విషయాన్ని వేణు మొగిలయ్య కు తెలియజేయగా, మొగిలయ్య దంపతులు ఒక ఇంటర్వ్యూ లో మెగాస్టార్ సాయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని మొగిలయ్య దంపతులు ఇలా బయటపెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవిది ఎంతో మంచి హృదయం అని ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కేవలం సినీ పరిశ్రమలో తన నటన, డాన్స్, యాక్షన్ సీక్వెన్స్ లతోనే కాకుండా ఐ బ్యాంకులు, బ్లడ్ బ్యాంకులు, ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు వంటి దాతృత్వ కార్యక్రమాలతో అందరి మన్ననలు పొందారు. ఆపదలో ఉన్న గాయకుడి పట్ల ఇటీవల ఉదారంగా వ్యవహరించడం చిరంజీవిలోని దయాదాక్షిణ్యాలకు నిదర్శనంగా నిలిచింది.
వేణు యెల్దండి దర్శకత్వం వహించిన ‘బలగం’ సినిమా చిన్న సినిమాగా విడుదలైనా ఎవరూ ఊహించని విధంగా మధ్య కాలంలో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.