మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన గ్యాంగ్ లీడర్ (1991) సినిమా ఫిబ్రవరి 11న తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ కానుంది. శరత్ కుమార్, మురళీ మోహన్, ఆనందరాజ్, రావుగోపాల్ రావు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. విజయ్ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బప్పీ లాహిరి సంగీతం అందించారు.
తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల రీ రిలీజ్ అయిన ఒకప్పటి ఐకానిక్ సినిమాల జాబితాలో తాజాగా గ్యాంగ్ లీడర్ చేరింది. ఒక్కడు (2003), జల్సా (2008), పోకిరి (2006), ఖుషి (2001) చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. సాధారణంగా 4కె ఫార్మాట్ లో రీమాస్టర్ అయిన ఈ సినిమాలు అభిమానుల ఆదరణతో థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులతో అంబరాన్ని అంటే సంబరాలకు తెరలేపాయి.
చిరంజీవి నటించిన ఘరానా మొగుడు (1992), గత ఏడాది ఆగస్టు చివర్లో ఆయన పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో రీ రిలీజ్ అయింది. అయితే ఇది కేవలం కొందరు ఔత్సాహిక మెగా అభిమానులకు తప్ప మిగతా ప్రేక్షకుల దృష్టి లోనే పడలేదు.
ఫ్యామిలీ సెంటిమెంట్, రొమాన్స్, అద్భుతమైన సాంగ్స్, బోలెడంత కిక్ ఇచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఇలా అన్నీ మేళవించిన గ్యాంగ్ లీడర్ సినిమా అప్పట్లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గత మూడు దశాబ్దాలుగా కమర్షియల్ సినిమాల ఫార్ములాకు ఒక దిక్సూచిగా నిలవడమే కాక యాక్షన్ హీరోగా చిరంజీవి స్టార్ ఇమేజ్ కు కల్ట్ ఫాలోయింగ్ ను కూడా ఈ చిత్రం తెచ్చి పెట్టింది.
ఈ సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి ఊపు మీద ఉన్న మెగా అభిమానులు ఈ రీ రిలీజ్ ను సీరియస్ గా తీసుకుని ఖచ్చితంగా భారీ స్థాయిలో ఫ్యాన్ షోలు, సంబరాలు ప్లాన్ చేస్తారని భావిస్తున్నారు.