బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చడ్డా నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 5400 స్క్రీన్ లలో భారీ ఎత్తున ప్రచారం చేయబడి విడుదలైంది. అయితే అనూహ్యంగా దారుణమైన ఓపెనింగ్స్ తో పాటు అంతే పేలవమైన సమీక్షలను రాబట్టుకుంది. గత 10 సంవత్సరాలలో ఏ అమీర్ ఖాన్ సినిమాకి కూడా రాని విధంగా చాలా తక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం గమనార్హం.
ఈ సినిమాకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడుగా వ్యవహరించారు. తెలుగు వెర్షన్ ప్రచారంలో అమీర్ కు ఎంతగానో సహకరించారు. మీడియాతో ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొన్నారు. దాంతో పాటు కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ.. చిరంజీవి, అమీర్ ఖాన్, నాగ చైతన్య లతో కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా చేశారు. అక్కినేని నాగ చైతన్య ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
అయితే లాల్ సింగ్ చడ్డా ప్రచారంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి.. ఈ సినిమా స్లోగా ఉంటుందని, కాస్త ఓపికతో చూస్తే తప్ప ఈ సినిమా నచ్చదని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు లాల్ సింగ్ చడ్డా సినిమాను ప్రేక్షకులు తిప్పి కొట్టిన నేపథ్యంలో.. ఈ సినిమా ఫలితం చిరంజీవికి రిలీజ్ కు ముందే తెలిసిపోయిందని, కేవలం అమీర్ ఖాన్ తో ఉన్న స్నేహం దృష్ట్యా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారని ఇప్పుడు అందరూ భావిస్తున్నారు.
లాల్ సింగ్ చడ్డా సినిమాలో అమీర్ సరసన హీరోయిన్ గా కరీనా కపూర్ నటించారు. మరియు తల్లి పాత్రలో మోనా సింగ్ కూడా నటించారు. ఈ సినిమా హాలీవుడ్ లో టామ్ హాంక్స్ నటించిన 1994 హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ కు అధికారిక రీమేక్ గా తెరకెక్కింది. భారతీయ నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి రీమేక్ చేయబడిన ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఒక చిన్న పాత్రలో కనిపించడం విశేషం. అయితే ఇన్ని జాగర్తలు తీసుకుని దాదాపు ఐదేళ్లకు పైగా నిర్మించి.. పైగా విస్తృత స్థాయిలో ప్రచారం చేసిన అమీర్ ఖాన్ కు చివరికి చేదు అనుభవం మిగలడం బాధాకరం.