టాలీవుడ్ సినిమా పరిశ్రమకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులని అందించనున్నామని, నంది అవార్డుల స్థానంలో ప్రతి ఏటా ఇవి ఇవ్వడం జరుగుతుందని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తద్వారా తెలుగు సినీ పరిశ్రమలో చేసిన కృషి, విజయాలకు ఇది గౌరవంగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలిపారు.
ఇక తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ, ఈ అంశం పై తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఎటువంటి స్పందన రాకపోవడం బాధాకరమని నిరాసక్తత వ్యక్తం చేసారు. విషయం ఏమిటంటే, తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఒక కార్యక్రమం ద్వారా స్పందించారు.
సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు, ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా గద్దర్ అవార్డ్స్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని అన్నారు. మొత్తంగా మెగాస్టార్ చొరవ తీసుకుని చేసిన ఈ వ్యాఖ్యలతో త్వరలోనే ఈ అంశం తుది దశకు చేరుకొని అర్హులందరూ గద్దర్ అవార్డులని అందుకోవాలని సినిమా పరిశ్రమ కోరుతోంది.