సైరా, ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల బడ్జెట్లను కంట్రోల్లో పెట్టే పనిలో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ భారీ బడ్జెట్ సినిమాలు చేసే రిస్క్ తీసుకోవడానికి ఆయన ఏమాత్రం ఇష్టపడటం లేదు. ఇక తన కూతురి నిర్మాణంలో ఓ సినిమాకు ఆయన కమిట్ అయ్యారు. అందుకోసం చిన్న లేదా వర్ధమాన దర్శకులు, కథా రచయితల నుంచి కథలు వింటున్నారని అంటున్నారు. తన కూతురి కోసం ఓ చిన్న బడ్జెట్ సినిమా చేసి తద్వారా ఆమెకు భారీ లాభాలు ఇవ్వాలనుకుంటున్నారు.
వాల్తేరు వీరయ్య వంటి భారీ విజయం తర్వాత మెగా స్టార్ చిరంజీవి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గాడ్ ఫాదర్, ఆచార్య వంటి సీరియస్ సినిమాలకు దూరంగా ఉంటూ తన సినిమాలకు మరింత ఎంటర్ టైన్ మెంట్ వాల్యూ జోడించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆచార్య ఫెయిల్యూర్ కారణంగా చిరంజీవి స్టార్ డైరెక్టర్లకు దూరంగా ఉంటూ ప్రతి విషయంలోనూ తన ఇన్ పుట్ తీసుకునే కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 2023 ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భోళా శంకర్ తమిళ బ్లాక్ బస్టర్ వేదాళం చిత్రానికి అధికారిక రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ కనిపించనున్నారు. కాగా చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో సుశాంత్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ కలిసి భోళా శంకర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
భోళా శంకర్ తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రం కోసం బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్టతో పని చేయడం దాదాపుగా ఖరారయింది. మరి కొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న చిన్న దర్శకులతో పనిచేయాలన్న మెగా స్టార్ ఆలోచనలకు ఈ ప్రాజెక్ట్ సరిగ్గా సరిపోతుంది.