మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్‌ల నేతృత్వంలోని ఈ నిర్మాణ సంస్థ చాలా తక్కువ సమయంలో భారీ బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించింది. దాదాపు అందరు అగ్ర హీరోలు, స్టార్ట్‌లు ఈ ప్రొడక్షన్ హౌస్ ప్రయాణంలో భాగంగా ఉండటం విశేషం.
ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు సినిమాకి చెందిన ఇద్దరు ప్రముఖ నటులు- చిరంజీవి మరియు బాలకృష్ణలతో చిత్రాలను రూపొందిస్తున్నారు. కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో చిరంజీవి వాల్తేరు వీరయ్యలో నటిస్తుండగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య NBK-107లో నటిస్తున్నారు.
ఇలా ఒకేసారి ఇద్దరు అగ్ర హీరోలతో పనిచేయడం అనేది ఎవరైనా గొప్ప అవకాశంగా భావిస్తారు. బహుశా మైత్రీ సంస్థ వారు కూడా ఈ విషయం పట్ల ఎంతో సంతోషంగా ఉండి ఉండవచ్చు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం.. చిరంజీవి మరియు బాలకృష్ణ ఇద్దరూ మైత్రీ సంస్థకు భారీ గందరగోళంలో పడేశారని తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏంటంటే , ఈ ఇద్దరు అగ్ర హీరోలు తమ తమ సినిమాలను 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నారట. కానీ ఒకే నిర్మాణ సంస్థ నుంచి ఒకే సమయంలో ఇలా కాంపిటీషన్లో విడుదల చేయడం అనేది ఎంత మాత్రం సరి కాదు. అటు వ్యాపార పరంగా.. ఇటు వ్యవహార పరంగా ఇది చాలా సమస్యను సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది.
అంతే కాకుండా.. ప్రభాస్ యొక్క ప్యాన్ – ఇండియా సినిమా ఆదిపురుష్ 2023 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మరి అలాంటప్పుడు ఎంత సంక్రాంతి సీజన్ అయినా.. ఇలా మూడు పెద్ద సినిమాలు విడుదల అవ్వాలంటే చాలా కష్టం. మరి సంక్రాంతికి చిరంజీవి – బాలయ్య సినిమాలలో ఏ సినిమాను విడుదల చేస్తారో మరియు హీరోలను ఎలా ఒప్పిస్తారో చూడాలి.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వాల్తేరు వీరయ్య మరియు NBK 107 సినిమాలు రెండింటిలోనూ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు . వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. బాలయ్య చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.