లైగర్ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న తరుణంలో.. సినీ ప్రేమికులతో పాటు పరిశ్రమ వర్గాల నుండి అనేక రకమైన వ్యాఖ్యలకు, కథనాలు వినపడుతున్నాయి. కేవలం ఒక్క సినిమా కోసం ఎక్కువ సమయం వృధా చేయకూడదని కొందరు భావిస్తే, మరి కొందరు పూరీ ఇంత బలహీనమైన స్క్రిప్ట్‌తో పాన్-ఇండియా విడుదలకు వెళ్లకుండా ఉండాల్సిందని భావిస్తున్నారు. సాధారణంగా సినిమా పరిశ్రమలో ఒక సినిమా భారీ వైఫల్యం చెందితే.. రకరకాల కారణాలు మరియు ఆ చిత్ర బృందం మీద నిందలు వేయడం మామూలే. కానీ , లైగర్ చిత్ర ఫలితం మాత్రం ఖచ్చితంగా పూరీ మరియు ఛార్మీలకు ఒక చేదు జ్ఞాపకంగా మిగులుతుంది అనడంలో సందేహం లేదు.
పూరి మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగానే లైగర్‌కి సహ నిర్మాతగా ఉన్న ఛార్మీ కౌర్, ఇప్పుడు భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. కోవిడ్ సమయంలో చాలా సినిమాలకు OTT ప్లాట్ ఫారమ్‌ల నుండి చాలా మంచి ఆఫర్‌లు వచ్చాయి. అందుకు నిర్మాతలు కూడా సంతోషంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లాభాలను పొందారు.
అయితే లైగర్ సినిమా కూడా ప్రముఖ OTT ప్లాట్ ఫారమ్ భారీ ఆఫర్‌ను అందుకుంది, ఆ అఫర్ ను చిత్ర బృందం కనుక ఒప్పుకుని ఉంటే సినిమామొత్తం బడ్జెట్‌ను చాలా సులభంగా తిరిగి పొందగలిగేది. అంతే కాకుండా ఛార్మీ, పూరీలకు భారీ లాభాలు కూడా వచ్చి ఉండేవి. అయితే ఆ సమయంలో ఛార్మీ ఆఫర్ తీసుకోవడానికి ఆసక్తి చూపినప్పటికీ.. పూరి అందుకు ఒప్పుకోకుండా సినిమాను థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించారట. ఇప్పుడు ఈ నిర్ణయం వారికి కోట్లాది నష్టాలను మిగిల్చింది.
లైగర్ సినిమా తాలూకు థియేట్రికల్ రైట్స్ దాదాపు 90కోట్ల వరకూ అమ్ముడయ్యాయి. కానీ కలెక్షన్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి, 60 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చే దశలో ఉన్న లైగర్ చిత్రం.. పూరీ మరియు విజయ్ దేవరకొండల కెరీర్ లోనే కాకుండా మొత్తంగా తెలుగు సినీ చరిత్రలో కూడా అతి పెద్ద డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది.