విరాట పర్వం మూవీ ప్రమోషన్లలో భాగంగా సాయి పల్లవి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ భజరంగ్ దళ్ రంగంలో దిగింది. హైద్రాబాద్, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. అదే విధంగా ఈ సినిమా దర్శకులు వేణు ఊడుగుల పై కూడా కేసు నమోదు చేయాలని భావిస్తోంది. విరాట పర్వం టైటిల్ కూడా అభ్యంతరంగానే ఉందని, మహాభారతంలో ఓ కీలక ఘట్టానికి సంబంధించిన పేరును, నక్సల్ మూమెంట్ బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమాకు ఎలా పెడతారని ప్రశ్నిస్తూ పోలీసులను ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
కాశ్మీర్ ఫైల్స్ లాంటి తీవ్ర కిరాతకమైన జెనో సైడ్ ను, గో రక్షక్ ఉదంతం లాంటి సంఘటనలను పోల్చి, సాయి పల్లవి ఇటీవల ఒక ఇంటర్వ్యూ లోమాట్లాడారు. ఏదో ఒక మతం చేసేది ఒప్పు అని ఇంకో మతాన్ని తప్పు అని మనం చెప్పలేం అని ఆమె అభిప్రాయ పడ్డారు.
ఇప్పుడు ఈ వివాదం సినిమా పై ఎలాంటి ఇబ్బందులను తీసుకు వస్తాయి అనేది చూడాలి, ఈ కేసు విషయం పై సినిమా టీమ్ ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇదిలా ఉండగా సాయి పల్లవి మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న నటులు చాలా తక్కువ అని ఒక వర్గం ప్రేక్షకులు అభిప్రాయ పడుతుంటే, మరో వర్గం ప్రేక్షకులు మాత్రం ఆమె మీద కోపంతో ఉన్నారు.ఇలా ఒకరు లెఫ్ట్ వింగ్, ఇంకొకరు రైట్ వింగ్ లాగా విడిపోయి వాదించుకుంటున్నారు.
ఈరోజే విడుదలైన ఈ సినిమా మీద ఈ వివాదాల ప్రభావం ఎలా ఉంటుందో కానీ, ఈ సినిమా కేవలం నేపథ్యం వరకు నక్సల్ – పోలీస్ ల మధ్య పోరాటాలు ఉంటాయి తప్ప ఇదొక కవితాత్మక ప్రేమకధ అని రచయిత మరియు దర్శకుడు అయిన వేణు ఉడుగుల తెలిపారు. ఆయన చెప్పిన విధంగానే ట్రైలర్ లో ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది, కానీ అదే యుద్ధం నా ప్రాణాలు పోసింది అని హీరోయిన్ క్యారెక్టర్ డైలాగ్ కూడా ఉంది. మరి ఈ తాజా వివాదం సినిమాకి ఉపయోగపడుతుందా లేక పరాజయానికి కారణంగా మారుతుందా అనేది చూడాలి.