సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష ఏప్రిల్ 21న విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన తెచ్చుకుంది. వాస్తవానికి నిర్మాతలు ఈ సినిమాను అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేయాలనుకున్నారు కానీ చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకుని ముందు తెలుగులో వచ్చిన స్పందన చూసి వారం రోజుల తర్వాత ఇతర భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తోంది.
ఈ సినిమా థియేట్రికల్స్ 25 కోట్లకు అమ్ముడుపోగా, ఓపెనింగ్ వీకెండ్ లోనే 20 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ సినిమా ఈ రోజుతో బ్రేక్ ఈవెన్ మార్క్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క తెలుగులోనే వరల్డ్ వైడ్ గా 40 కోట్లకు పైగా షేర్ వసూలు చేసే అవకాశాలు ఉండటంతో ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు.
ఈ సినిమా చూశాక విరూపాక్ష నిజంగానే పాన్ ఇండియా కంటెంట్ అని చాలా మంది ప్రేక్షకులు కూడా భావించారు. ఇప్పుడు ఈ సినిమాను హిందీలోకి డబ్ చేసి మే 5న విడుదల చేయనున్నట్లు హీరో, చిత్ర బృందం ధృవీకరించింది. గతంలో కాంతార, కార్తికేయ 2 వంటి చిన్న సినిమాలు హిందీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. కాబట్టి విరూపాక్ష కూడా ఖచ్చితంగా హిందీ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన చేసే అవకాశం ఎంతైనా ఉంది.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన విరూపాక్ష చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సహా పలు భాషల్లో విడుదల కావాల్సి ఉన్నా అనుకోని కారణాల వల్ల తెలుగులోనే విడుదలైంది. మరి వారం తరువాత హిందీలో విడుదలై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది చూద్దాం. బి.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి షామ్దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ భాద్యతలు చూసుకున్నారు.
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, అజయ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. రుద్రవనం అనే గ్రామంలో జరిగే అపరిష్కృత అంశాల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి సుకుమార్ రచనా భాద్యతలను నిర్వర్తించారు.