బాహుబలి సిరీస్ తర్వాత ప్రతి ఇండస్ట్రీ లోనూ అలాంటి సినిమా తీయాలి అన్న తపన, ప్రయత్నాలు ఎక్కువ అయ్యాయి.అలాంటి ప్రయత్నాల్లో ఒక్కటి బ్రహ్మస్త్ర.
బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బ్రహ్మాస్త్ర ట్రెయిలర్ ఈరోజు విడుదల అయింది. పాన్ ఇండియా రిలీజ్ కానున్న ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తుండగా ముఖ్య పాత్రలో అమితాబ్ బచ్చన్, మరో అతిధి పాత్రలో కింగ్ నాగార్జున కనిపించబోతున్నాడు.
ఈ చిత్రానికి తెలుగులో రాజమౌళి విరివిగా ప్రచారం చేసారు. స్క్రిప్ట్ లో కొన్ని అదనపు అంశాలు ఆయన పరిశీలించినట్లు తెలుస్తుంది. కాగా తెలుగు ట్రైలర్ లో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో విశేషం.ఇక ట్రైలర్ విషయానికి వస్తే, సృష్టిలో కొన్ని అద్భుతాలలో మనకే తెలియని ఒక ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
అగ్ని,వాయువు,నీరు ఇలా పంచ తంత్రాలతో కూడుకున్న అంశాలు ఉండగా, అదే సమయంలో వీటికి ఏ మాత్రం సంబంధం లేని సాధారణ వ్యక్తి అయిన శివ (రణ్బీర్ కపూర్) ఎలా తనకి ఉన్న అతీంద్రియ శక్తులను కనుగొన్నాడు, వాటితో అతను చేయాల్సిన కార్యాలు ఎంటి అనే ఆసక్తి పెంచేలా ట్రైలర్ ను కట్ చేయడం జరిగింది.
అయితే అనుకోవడానికి పాయింట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, ఫాంటసీ చిత్రానికి ఉండాల్సిన క్వాలిటీ మిస్ అయిందీ ట్రైలర్ లో. మరీ ముఖ్యంగా గ్రాఫిక్స్ సాధారణ స్థాయిలో ఉండి నిరాశ పరిచాయి.
హిందీ ప్రేక్షకులకి ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు అరుదు గనక వారికి ఈ ట్రైలర్ ఆకట్టుకుని ఉండచ్చు. కానీ ఇతర భాషల్లో బ్రహ్మస్త్ర జెండా ఎగర వేయాలంటేమరింత కసరత్తు చేయక తప్పదు.ఎందుకంటే ఇలాంటి ఫాంటసీ సినిమాల నుండి సాంకేతికంగా చాలా ఉన్నతమైన ప్రమాణాలు ఆశిస్తారు ప్రేక్షకులు. వాళ్ళ అంచనాలను అందుకొలేని పక్షంలో ఎంత భారీ బడ్జెట్ అయినా, ఎంతమంది తారలు ఉన్నా సినిమా పరాజయం పాలవకుండా ఆపలేరు.