రణబీర్ కపూర్ హీరోగా నటించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర తొలి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ మరియు పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు, ఓపెనింగ్ ను సాధిస్తుంది అన్న అంచనాలు విడుదలకు ముందే ఏర్పరచుకుంది. ఆ క్రమంలో హిందీ సినిమాల్లో ఆల్ టైమ్ నాన్-హాలిడే రికార్డ్ ఓపెనింగ్‌ను నమోదు చేసింది.
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్‌తో సతమతమవుతున్న బాలీవుడ్ ఇండస్ట్రీ, బ్రహ్మాస్త్ర సినిమాతో పుంజుకుంటుంది అని ట్రేడ్ వర్గాల్లో చాలా అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకొని ఈ సినిమా తొలి రోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను సాధించడం బాలీవుడ్ వర్గాలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం. కాగా ఈ చిత్రానికి ఓవర్సీస్ మరియు ఇతర భాషలలో కూడా అద్భుతంగా ఓపెనింగ్స్ వచ్చాయి, ముఖ్యంగా తెలుగులో చాలా మంది టైర్-2 తెలుగు హీరోలతో సమానంగా ఓపెనింగ్స్ సాధించడం విశేషం.
బాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన బ్రహ్మాస్త్ర చాలా ఏళ్ళ పాటు దర్శకుడు అయాన్ ముఖర్జీ పడిన కష్టానికి ప్రతిఫలంగా రూపొందింది. ఈ చిత్రంలో అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున కూడా కీలక పాత్రల్లో నటించారు. ఫాంటసీ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కిన చిత్రం ప్యాన్-ఇండియా స్థాయిలో విడుదలైంది. ఇక దర్శకుడు అయాన్ ముఖర్జీ మరియు నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు ప్రధాన తారాగణం ఈ చిత్రాన్ని మరింతగా ప్రచారం చేయడంలో నిమగ్నమై ఉన్నారు.
రణబీర్ కపూర్ నటించగా ఇటీవలే విడుదలైన షంషేరా సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. అలాంటి ఫలితం తర్వాత భారీ హిట్ సాధించే దిశగా బ్రహ్మాస్త్రకు మంచి ఓపెనింగ్స్ రావడం అయననే కాకుండా మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా ఎంతో సంతోషపరిచే విషయం.
తొలి రోజు బాక్స్ ఆఫీసు వద్ద ఘనంగా ఆరంభమైన ఈ చిత్రం వీకెండ్ వరకూ 100 కోట్ల మ్యాజికల్ నంబర్ ను దాటుతుంది అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి వారి అంచనాలకు మించి బ్రహ్మాస్త్ర సినిమా తన లాంగ్ రన్ ను కొనసాగించాలి అని కోరుకుందాం.