రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం సెప్టెంబర్ 9న విడుదలైంది. కాగా ఈ చిత్రం ఇప్పటివరకు మంచి లాంగ్ రన్ తెచ్చుకుని లాభసాటి వ్యాపారం జరుపుకుంది. బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక హైప్ తో వచ్చిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం అద్భుతమైన VFX మరియు నిర్మాణ విలువలకు ఎంతగానో ప్రశంసించబడింది. అయితే తొలి రోజు ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను పొందినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ ఓపెనింగ్ తో పాటు అనేక రికార్డులను సృష్టించింది.
ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో నడుస్తుండగా, దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి పార్ట్ 2 మరియు పార్ట్ 3 విడుదల ఎప్పుడనేది వెల్లడించారు. పార్ట్ 2 ను దీవాలి 2025 సందర్భంగా, పార్ట్ 3 ను క్రిస్టమస్ 2026 సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇవి కేవలం అంచనాలు మాత్రమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమాలకు చిత్రీకరణ దశలో కాస్త జాప్యం జరగడం మామూలే.
హాలీవుడ్‌లో ట్రయాలజీ చిత్రాలకి అయితే ఇంత భారీ గ్యాప్ చాలా సాధారణమైన విషయం. కానీ బాలీవుడ్‌లో ఈ వ్యూహం పని చేస్తుందా లేదా అనే దాని పై ఇప్పుడు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
మూడు భాగాల మధ్య గ్యాప్ బాగా ఎక్కువగా ఉంది. ఇక బ్రహ్మాస్త్ర పార్ట్ 1 బాహుబలి లేదా KGF సినిమాల లాగా పెద్ద బ్లాక్ బస్టర్ కూడా కాదు. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద మంచి విజయం మాత్రం సాధించింది. మరి ఈ ప్లానింగ్ తో ఈ ఫ్రాంచైజీ పట్ల ప్రేక్షకులలో ఆసక్తి ఉండేలా చేయడంలో చిత్ర బృందం సఫలమవుతారో లేదో చూడాలి.
బ్రహ్మాస్త్ర చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. అమితాబ్ బచ్చన్, నాగార్జున మరియు మౌని రాయ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి రచయితతో పాటు దర్శకుడిగా కూడా వ్యవహరించారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.