బాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాబ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న భారీ స్థాయిలో ప్లాన్ చేసారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించడంతో చివరి నిమిషంలో ఒక ఇండోర్ ప్రెస్ మీట్ గా మార్చారు. ఈ ఇండోర్ ఈవెంట్ చాలా బాగా జరిగింది. అయితే, అసలు ప్రి రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేయడం వెనుక ఉన్న అసలు కారణం వేరే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
భారీగా ప్లాన్ చేసిన బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు అవుతున్న కారణంగానే అనుమతులు నిరాకరించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి చేయడం వల్లే.. ముందుగా అనుమతించిన కార్యక్రమాన్ని రద్దు చేశారని ఒక గట్టి వార్త ఇపుడు ప్రచారంలో ఉంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సమావేశం వల్ల ప్రభుత్వం ఇప్పుడు ఎన్టీఆర్‌ను వ్యతిరేకిస్తోందని అంటున్నారు.
తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం బాగా వేడిగా ఉంది. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టాలని చూస్తోంది. కాగా అమిత్ షాతో ఎన్టీఆర్ కలవడం కేవలం ఒక స్నేహపూర్వక మరియు అభినందన తెలిపేందుకు జరిగిన ఒక సాధారణ సమావేశం అయితే, దానికి ఇప్పుడు రాజకీయ రంగు పులుముతున్నారు.
ఇక నిన్న రాత్రి జరిగిన బ్రహ్మస్త్ర ప్రెస్ మీట్ కుప్రత్యేక అతిథిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈవెంట్ కేన్సిల్ అయినందుకు బాధ పడుతున్న అభిమానులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు, ఈ ఈవెంట్ గురించి చాలా ఉత్సాహంగా ఉన్న నా అభిమానులకు మరియు మీడియా మిత్రులకు నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను అని ఆయన అన్నారు. ఈ వేడుకకు ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, బ్రహ్మాస్త్ర సినిమాలో హీరో – హీరోయిన్లు.. నిజ జీవితంలో దంపతులు అయిన రణ్బీర్ కపూర్, అలియా భట్, మరియు నిర్మాత కరణ్ జోహార్ కూడా హాజరయ్యారు.