బాక్స్ ఆఫీస్ పై కమల్ హాసన్ నటించిన విక్రమ్ దాడి ఇప్పట్లో ఆగేలా లేదు. తొలి రోజు నుంచీ అటు ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరుస్తోందీ సినిమా కలెక్షన్ ల వేట.
తమిళ నాట ఈ చిత్రానికి మొదటి నుంచీ మంచి క్రేజ్ ఉంది, లోకేష్ కనగరాజ్ – కమల్ హాసన్ కాంబినేషన్ ఒక కారణం అయితే, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లు కూడా ముఖ్య పాత్రలలో ఉండటం సినిమా మీద మరింత ఆసక్తిని పెంచింది.
ఇక చక్కని యాక్షన్ థ్రిల్లర్ చూడబోతున్నాం అనిపించేలా కట్ చేసిన ట్రైలర్ లు ఆకట్టుకోగా,హాలీవుడ్ స్టైల్ కి దగ్గరగా ఉన్న అనిరుధ్ సంగీతం అందరినీ ఆకర్షించింది. తొలుత ఈ సినిమా పట్ల అంతగా తెలియకున్నా రిలీజ్ సమయానికి బాగానే ఆసక్తి కనబర్చారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు.
దానికి తగ్గట్టుగానే తొలి రోజు సినిమా టాక్ అద్భుతంగా వచ్చింది, ఇక కలెక్షన్ లు కూడా ఊపందుకున్నాయి. చాలా ఏళ్ళ తరువాత ఇది కమల్ కి నికార్సైన హిట్ గా చెప్పుకోవచ్చు.
ఇప్పటికే తమిళనాడు లో విక్రమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలవగా, తెలుగులోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల బిజినెస్ 7 కోట్లకు చేసుకుంటే 12 రోజులకే 14 కోట్లు వసూలు చేసింది.ఎవరూ ఊహించని రీతిలో తెలుగు రాష్టలలో డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది విక్రమ్. ఆ ప్రభంజనం ఇంతటితో ఆగుతుందో లేక మరిన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూద్దాం.