తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ జూన్ నెలలో నిజానికి ఘనంగానే ఆరంభమయింది. 3న విడుదల అయిన “మేజర్” మరియు “విక్రమ్” చక్కని ప్రశంసలతో పాటు కలెక్షన్లు కూడా గట్టిగా వసూలు చేసాయి.మేజర్ తొలి మూడు రోజుల తరువాత హవా కాస్త తగ్గినా, మొత్తానికి లాభసాటి వ్యాపారం జరుపుకుంది.ఇక విక్రమ్ సినిమా అద్భుతమైన టాక్ తో పాటు లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపింది. తమిళనాడులో బాహుబలి 2 ను దాటేసి, దేశవ్యాప్తంగా కలెక్షన్లలో కూడా తమిళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగు డబ్ వెర్షన్ కూడా 30 కోట్ల గ్రాస్ వరకూ కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ఇక ఆ తరువాత వారం రిలీజ్ అయిన నాని నటించిన “అంటే సుందరానికీ” టాక్ వరకూ డిసెంట్ అనిపించుకున్నా కలెక్షన్లు మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. నాని స్టార్డం పైనే అనుమానాలు వచ్చెలా ఉండింది ఆ సినిమా బాక్స్ ఆఫీస్ రన్. పోయిన వారం రిలీజ్ అయిన “విరాట పర్వం” కూడా తొలి రోజు వరకు మంచి రివ్యూలు దక్కించుకున్నా కలెక్షన్లు మాత్రం తీసికట్టుగ ఉండి నిరాశపరిచాయి. ఇక నటుడుగా మంచి పేరున్న సత్యదేవ్ నటించిన “గాడ్సే” తొలి ఆట నుంచే పూర్తిగా ప్రేక్షకుల తిరస్కరణకు గురయింది.
24న అంటే ఈ వారం చాలా చిన్న సినిమాలు రిలీజ్ అవగా, అందులో లేటెస్ట్ యూత్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన “సమ్మతమే” రిలీజ్ లు ముందు కాస్త క్రేజ్ తో వచ్చింది. ఈ చిత్రానికి రివ్యూల వరకు ఓకే అనిపించినా కలెక్షన్లు పెద్దగా రావట్లేదు, మరి వారాంతం వసూళ్లు ఏమైనా పెరుగుతాయా లేదా చూడాలి. పూరి జగన్నాద్ కొడుకు ఆకాష్ పూరీ నటించిన “చోర్ బజార్” కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేదు. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయిన నిర్మాత ఎం ఎస్ రాజు దర్శకుడుగా ఆయన కొడుకు సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన ” 7 డేస్ 6 నైట్స్” తో పాటు మరో రెండు మూడు సినిమాలు రిలీజ్ అయినా చాలా చోట్ల తొలి రోజేథియేటర్ల నుండి తీసివేయబడ్డాయి.
మొత్తానికి తెలుగు సినిమాకి ఈ నెల ఆరంభం బాగున్నా కొనసాగింపు మాత్రం సంతృప్తికరంగా లేదు. వరుసపెట్టి సినిమాలు వస్తుండటంతో ప్రేక్షకులు తమకు అంతో ఇంతో ఆసక్తిని కలిగించే సినిమాలనే చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇక వచ్చే నెలలో వస్తున్న చిత్రాలైనా విజయవంతం అయి బాక్స్ ఆఫీస్ కు ఊపిరి పోయాలి అని కోరుకుందాం.