నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు సంపాదిస్తూ..ప్రేక్షకుల చేత విశేషమైన స్పందనను సొంతం చేసుకుంటుంది. ఆగష్టు 13న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే సూపర్ పాజిటివ్ టాక్ ను దక్కించుకునిప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయవంతం అయింది.ఇక ఆగస్టు పదిహేను లాంగ్ వీకెండ్ కూడా సినిమా కలెక్షన్లకు సహాయపడింది అనే మాట కూడా వాస్తవమే.
కార్తికేయ-2 కలెక్షన్లు మొదటి రోజు కంటే, రెండో రోజు, మూడవ రోజున ఎక్కువ కలెక్షన్లను నమోదు చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ సెలవుదినం అవడం వల్ల సోమవారం కూడా సినిమా హాళ్లకు ప్రేక్షకులు భారీ స్థాయిలో తరలి వచ్చారు. కార్తికేయ 2 తెలుగుతో పాటు హిందీలోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. నిజానికి ఉత్తరాదిన ఈ సినిమాకి తక్కువ ధియేటర్లు దొరికినా, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన టాక్ పెరుగుతూ ఉండటంతో, పైగా హీరో నిఖిల్ తో సహా ఎంతో మంది సోషల్ మీడియా యూజర్లు సినిమాకి ధియేటర్లు పెంచాలని మల్టిప్లేక్స్ హ్యాండిల్ లను ట్యాగ్ చేసి మరీ డిమాండ్ చేయడంతో అలా రోజూ పెంచుకుంటూ పోతున్నారు. కార్తికేయ 2 సినిమా తొలి మూడు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద 15 కోట్లు వసూలు చేసింది. హిందీ వెర్షన్ వరకూ నిన్న ఒక్క రోజే కోటి రూపాయలకు పైగా నెట్ కలెక్షన్లు సాధించడం విశేషం. ఈ సినిమా ఇప్పటికే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక రేపటితో లాభాల్లోకి అడుగు పెడుతుందని ట్రేడ్ వర్గాల అంచనా.
ఇక గత వారం విడుదలైన సీతా రామం, బింబిసార చిత్రాలు కూడా ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి. సీతా రామం తొలి వారాంతంలో మంచి నంబర్స్ రాబట్టడం మాత్రమే కాకుండా తరువాత సాధారణ రోజులలో కూడా ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేస్తుంది. సినిమాలో లీడ్ పెయిర్ అయిన దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయ్యారు వారి ఆన్-స్క్రీన్ రొమాన్స్ ప్రేక్షకులకి కన్నుల పండగగా అనిపించింది అంటే అది అతిశయోక్తి కాదు.
రెండో వారంలో అడుగు పెట్టిన సీతా రామం తెలుగు వెర్షన్‌కే 25 కోట్ల షేర్ వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్‌ను మార్కును దాటేసి లాభాల్లోకి ప్రవేశించి లాంగ్ రన్ ద్వారా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇక నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద దిగ్విజయంగా వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం మొదటి రోజు నుంచి మంచి రివ్యూలతో అద్భుతమైన కలెక్షన్లను సంపాదించడమే కాకుండా కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ ను సాధించి ఆ పైన కూడా బాక్స్ ఆఫీసు వద్ద నిలకడగా రాణిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 30 కోట్ల షేర్ ను అందుకునే దిశగా దూసుకు పోతుంది. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటనతో పాటు కీరవాణి నేపథ్య సంగీతం, చిరంతన్ భట్, కీరవాణి సంయుక్తంగా అందించిన పాటలు, చైల్డ్ సెంటిమెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
మొత్తానికి కొన్ని నెలలుగా సరైన విజయం లేక సతమతమయిన తెలుగు సినిమా పరిశ్రమకు ఈ ఆగస్టు నెలలో వరుసగా మూడు సినిమాలు బింబిసార, సీతా రామం, కార్తీకేయ 2 ఘన విజయం సాధించి మళ్ళీ పూర్వ వైభవం తీసుకువచ్చాయి.