బాలీవుడ్ పరిశ్రమ గత కొన్ని రోజులుగా సరైన విజయాలు లేక వెలవెల బోతున్న సంగతి తెలిసిందే. నిజానికి కోవిడ్ పాండేమిక్ దాడుల తర్వాత అన్ని సినిమా పరిశ్రమలు కూడా కుదేలైన మాట వాస్తవమే. కానీ మిగతా అన్ని పరిశ్రమలు మొదట్లో ఇబ్బందులని ఎదురుకున్నా.. తరువాత ఎలాగోలా నిలదొక్కుకున్నాయి. కానీ హిందీ పరిశ్రమకు మాత్రం ఒకటి రెండు సినిమాలు తప్ప సరైన విజయం దక్కలేదు. ముఖ్యంగా బాలీవుడ్ ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న విషయం ఏమిటంటే స్టార్ హీరోల సినిమాలు వారి స్థాయిలో బాక్స్ ఆఫీసు వద్ద తమ ప్రభావాన్ని చూపించలేకపోవటమే.
చాలా రోజుల తర్వాత ఇటీవల విడుదలైన ‘బ్రహ్మాస్ర్త’ సినిమా మాత్రమే భారీ ఓపెనింగ్స్ ను సాధించగలిగింది. అయితే అందుకు కారణం లేకపోలేదు. బ్రహ్మస్త్ర చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కటమే కాకుండా బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ ప్రచారంతో రావడం వల్ల ఆ సినిమాకి ఎక్కడ లేని హైప్ వచ్చింది. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ ను, ఆ తర్వాత కూడా ఒక 10 రోజుల వరకూ నిలకడగా వసూళ్లను తెచ్చుకుంది. అయితే బ్రహ్మస్త్ర సినిమా మినహా మరే హిందీ స్టార్ హీరో చిత్రం కూడా సరైన ఓపెనింగ్స్ ను తెచ్చుకోలేదు.
అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా , అక్షయ్ కుమార్ యొక్క రక్షా బంధన్ వంటి సినిమాలకు కూడా చాలా సాధారణ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను తెచ్చుకున్నారు. సరే వారి సినిమాలకు ఇతర వివాదాలతో పాటు ఆయా సినిమాల పై ప్రేక్షకులకి సరైన ఆసక్తి లేదని చెప్పుకోవచ్చు. కానీ హృతిక్ రోషన్ కు ఎలాంటి వివాదంతోనూ సంబంధం లేదు. పైగా ఆయన నటించిన చివరి చిత్రం విడుదలై 3 సంవత్సరాలు అవుతుంది.
2019లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన వార్ సినిమా తరవాత ఇన్ని రోజులకు ఆయన నటించిన తాజా చిత్రం విక్రమ్ వేదా విడుదలవుతోంది, కానీ ఆశ్చర్యకరంగా ఈ చిత్రం కూడా భారీ స్థాయిలో ఓపెనింగ్ నంబర్లను తెచ్చుకోవడంతో విఫలమైనట్లే కనిపిస్తుంది. ఈ చిత్రం తాలూకు ప్రీ బుకింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఈ పరిస్థితిని చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు మరియు ట్రేడ్ వర్గాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. ఇక బాలీవుడ్‌లో స్టార్‌ల శకం ముగిసినట్లేనని, అక్కడి ప్రేక్షకులకి ఇప్పుడు కేవలం కంటెంట్ మాత్రమే ముఖ్యమని కొందరు విశ్లేషకులు అంటున్నారు.
అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. విక్రమ్ వేద స్ట్రెయిట్ హిందీ సినిమా కాదు. తమిళ భాషలో అదే పేరుతో వచ్చిన చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ఓటిటి యుగంలో రీమేక్ చిత్రాల పై ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించడం లేదు. అందువల్ల కూడా విక్రమ్ వేద సినిమా ఆశించిన స్థాయిలో బుకింగ్స్ పొందలేదని ఒక వాదన వినిపిస్తోంది. అందులోనూ నిజం లేకపోలేదు.
అయితే తాజాగా విక్రమ్ వేద సినిమా స్పెషల్ ప్రీమియర్ షో చూసిన అక్కడి ప్రముఖ రివ్యూయర్లు మాత్రం సినిమా అద్భుతంగా ఉందని కితాబులివ్వడం విశేషం. మరి ఈ టాక్ నిజమై విక్రమ్ వేద సినిమా ఓపెనింగ్ షోల తర్వాత కలెక్షన్లు పెంచుకుని బాలీవుడ్ కి అవసరమైన బ్లాక్ బస్టర్ సినిమాని అందిస్తుంది అని ఆశిద్దాం.