ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. చాలా కష్ట కాలంలో నడుస్తున్న ఆ పరిశ్రమకు భూల్ భూలయ్యా 2, ది కాశ్మీర్ ఫైల్స్ మరియు జుగ్ జుగ్ జగ్ జియో వంటి కొన్ని సినిమాలు మినహా, చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా పరాజయం పొందాయి. తద్వారా ట్రేడ్ వర్గాల గందరగోళంలోకి నెట్టేశాయి.తాజాగా ఈ వారం విడుదలైన అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా మరియు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన రక్షా బంధన్ రెండు సినిమాలు కూడా ఏవరూ ఊహించని రీతిలో భారీ డిజాస్టర్లుగా మారాయి.
ఈ రెండు చిత్రాలు కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కాయి. కాగా హాలిడే వీకెండ్ కు కాస్త మంచి బజ్ తో విడుదలైన ఈ సినిమాలు భారీ విజయం సాధించి బాలీవుడ్ కి పూర్వ వైభవం తీసుకు వస్తాయని ట్రేడ్ వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ రెండు సినిమాల ద్వారా మార్కెట్ తిరిగి పుంజుకుంటుంది అని భావించాయి. కానీ వారి ఆశలన్నీ అడియాశలు చేస్తూ లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ సినిమాలు భారీ డిజాస్టర్లు గా నిలిచాయి.
ఈ పరిస్థితి గురించి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మాట్లాడుతూ, బాలీవుడ్ ఇప్పుడు టాలీవుడ్ ను చూసి నేర్చుకోవాలని, వారి పంథానే అనుసరించాలని సూచించారు. అక్షయ్ కుమార్ నటించిన మూడు సినిమాలు బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షా బంధన్ ఈ ఏడాది విడుదలయి పరాజయం పాలయ్యాయి.
ప్రస్తుతం తెలుగు పరిశ్రమ సరైన రీతిలో తమ పునరుద్ధరణ జరుపుకుంతుందని నేను నమ్ముతున్నాను, సినిమాలు నిర్మించే క్రమంలో ఎక్కడ తప్పులు దొర్లుతున్నాయి అనే విషయం పై వారు ఆలోచిస్తున్నారు. ఈ సమస్యకి వారు సరైన పరిష్కారంతో ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను. హిందీ పరిశ్రమ కూడా అదే తరహాలో పని చేస్తే, అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను అని అక్షయ్ కుమార్ అన్నారు.
మరి అంత అనుభవం కలిగిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇలా వ్యాఖ్యానించారు అంటే అందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది. మరి ఆయన ఆశించినట్లుగా, ఎక్కడ తప్పు జరుగుతుందో అన్న విషయం బాలీవుడ్ ఇండస్ట్రీ పసిగట్టి తిరిగి మంచి రోజులు వచ్చే దిశగా అడుగులు వేస్తుందని ఆశిద్దాం.