ఇటీవల, తన తాజా చిత్రం సర్కస్ విడుదలకు ముందు రోజుల్లో, రోహిత్ శెట్టి సినిమా విజయం పట్ల చాలా నమ్మకంగా కనిపించారు. మరియు బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎందుకు కష్టపడుతున్నాయో అనే విషయం పై మాట్లాడారు. అయితే తన సినిమాలు మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తాయని, ఎందుకంటే తనకి ప్రేక్షకులతో చక్కని సంబంధం ఉందని ఆయన అన్నారు.
ఒక సినిమా నుండి సగటు ప్రేక్షకుడు ఏమి కోరుకుంటున్నారో తనకు తెలుసు అన్నట్లుగా వ్యాఖ్యానించారు రోహిత్ శెట్టి. ఆయన చెప్పిన మాటలకి తగ్గట్టే ఆయన ట్రాక్ రికార్డ్ కూడా ఉంది.
రోహిత్ శెట్టి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాధారణంగా భారీ ఓపెనింగ్స్ ను కలిగి ఉంటాయి. నిజానికి కోవిడ్ తర్వాత సూర్యవంశీ సినిమాతో బాలీవుడ్ మార్కెట్ ను ఆయనే పునరుద్ధరించారు. ఇటీవల, బాలీవుడ్ సినిమాలు మరియు వాటి కంటెంట్ గురించి తీవ్రంగా ట్రోల్ చేస్తున్న వ్యక్తులకు వ్యతిరేకంగా గళం విప్పినందుకు ఆయన వార్తల్లో నిలిచారు.
తాజాగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కస్’ సినిమాకు ప్రేక్షకులు పెద్ద షాక్ ఇచ్చారు. ఈ చిత్రం భారతదేశంలో మొదటి రోజు 7.5 కోట్ల నెట్ తో దారుణమైన సంఖ్యతో ప్రారంభమైంది మరియు రెండవ రోజు కూడా కలెక్షన్లలో ఎలాంటి అభివృద్ధి లేదు.
అంతే కాకుండా మొదటి రోజు నుండి పోలిస్తే మరింత పడిపోయింది మరియు రెండవ రోజు కేవలం 6.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ చిత్రం బాలీవుడ్ లో అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచే దిశగా అడుగులు వేస్తుంది.
సర్కస్ విడుదలకు ముందు రోహిత్ శెట్టి ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఒక మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా ఈ సంవత్సరం సౌత్ సినిమాలు బాలీవుడ్ సినిమాలను డామినేట్ చేసిన విషయం గూర్చి ప్రస్తావిస్తూ.. 1970 ల నుండి బాలీవుడ్ ఒక బ్లాక్ బస్టర్ ను ఒకదాని తర్వాత మరొకటి ఎన్నో సార్లు ఇచ్చిందని ఆయన తెలిపారు.
దీవార్, డాన్, హమ్ ఆప్కే హై కౌన్, కభీ ఖుషీ కభీ ఘుమ్, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, సింగం, సూర్యవంశీ, అమర్ అక్బర్ ఆంథోనీ వంటి అనేక చిత్రాలను ఆయన ఉదాహరణగా చూపించారు.
భారతదేశంలో కమర్షియల్ చిత్రాలకు ఒక బెంచ్ మార్క్ ను బాలీవుడ్ సెట్ చేసిందని, కేవలం ఒక సంవత్సరం సరిగా లేనంత మాత్రాన బాలీవుడ్ పరిశ్రమను తక్కువ చేయలేమని రోహిత్ శెట్టి అన్నారు. కానీ ఆయన తాజా చిత్రం సర్కస్ భారీ డిజాస్టర్ దిశగా వెళ్తుండటంతో, అతను అతి విశ్వాసంతో కాకుండా కాస్త ఆచి తూచి మాట్లాడాల్సిందని ప్రేక్షకులు ఇప్పుడు ఎత్తి చూపుతున్నారు.