ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని రికార్డులు కొల్లగొట్టింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రెండు రాష్ట్రాల తో పాటి, ఓవర్సీస్,మరియు హిందీ మార్కెట్ లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇక థియేటర్ల లో సందడి చేసిన తరువాత మే చివరి వారం లో ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఓటిటి లో విడుదల అయింది. తెలుగు తో పాటు మిగతా దక్షిణ భాషల స్ట్రీమింగ్ హక్కులు జీ5 దక్కించుకుంది. ఇక హిందీ మరియు అంతర్జాతీయ వెర్షన్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఓటిటి లో విడుదల అయిన తరువాత ఆర్ ఆర్ ఆర్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు.
ముఖ్యంగా అంతర్జాతీయ ప్రేక్షకులు ఆర్ ఆర్ ఆర్ చూసి మతి పోయే తరహాలో సోషల్ మీడియాలో తమ స్పందనను ఒక్కో విధంగా తెలియ చేస్తున్నారు.
తెలుగు ప్రేక్షకులు ఎలా అయితే ఆర్ ఆర్ ఆర్ చూసి ఆనందించారో అంతకు రెట్టింపు స్థాయిలో అంతర్జాతీయ ప్రేక్షకులు సినిమా పట్ల ఆకర్షితులు అయ్యారు.1920 బ్యాక్ డ్రాప్ లో భారత స్వతంత్ర పోరాట యోధులు అయినా అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లను ప్రధాన పాత్రలుగా, వాళ్లిద్దరూ కలిస్తే, కలిసి ఒకరికి ఒకరు స్వతంత్ర పోరాటంలో స్ఫూర్తిగా నిలిస్తే ఎలా ఉంటుంది అన్న కథాంశంతో ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా లో ఉన్న వీరోచిత పోరాట ఘట్టాలు, కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు గుండె బరువేక్కే భావోద్వేగాలను అచ్చం మనం అనుభూతి పొందినట్టు వాళ్ళు కూడా పొందుతుండడం విశేషం.
కొంత మంది ప్రేక్షకులు అయితే ఆర్ ఆర్ ఆర్ ను ఏకంగా ఎవెంజర్స్ లాంటి హాలీవుడ్ సూపర్ హీరోలతో పోల్చడం సినిమా టీమ్ ను కూడా ఆశ్చర్యపరిచింది. ఇక సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, బ్రోమాన్స్ ను కూడా విపరీతంగా అభినందిస్తున్నారు. మరీ ముఖ్యంగా నాటు నాటు పాటకు వెర్రెత్తిపోయి తమ స్పందనను ట్వీట్ లు, వీడియోల ద్వారా తెలిపారు.
ఆర్ ఆర్ ఆర్ థియేటర్ లలో విడుదల అయినపుడు ఇంతగా అంతర్జాతీయ ఆదరణను రాబడుతుంది అని బహుశా చిత్ర బృందం కూడా ఊహించి ఉండరు. ఏదేమైనా మన తెలుగు సినిమా ఈ రేంజ్ లో ప్రఖ్యాతి పొందటం మనందరికీ గర్వ కారణమే.