ప్రస్తుతం తెలుగు హీరోల్లో జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతి సినిమాతో ఏదో ఒక కొత్త రకమైన ప్రయత్నం చేయడానికి ఆసక్తి చూపే హీరో కల్యాణ్‌రామ్. ఆయన కేవలం హీరోగానే కాకుండా చక్కని అభిరుచి గల నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్నారు. తన స్వంత సినిమాలే కాక రవితేజ తో కిక్ 2 సినిమాని సైతం నిర్మించారు. తాజాగా ఆయన హీరోగా నిర్మిస్తూ నటిస్తున్న చిత్రం ‘బింబిసార’ . ఈ సినిమాను ఆగష్టు 5న విడుదల చేస్తున్నట్టు ఇది వరకే ప్రకటించారు.
ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోన్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా క్యాథరిన్ తేరేసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. చారిత్రక నేపథ్యం తో పాటు సైన్స్ ఫిక్షన్ జానర్‌లో రూపొందించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తోంది. బింబిసార గా కళ్యాణ్ రామ్ ఇందులో కనిపించనున్నారు. ఈ చిత్రం ‘ జగదేకవీరుడు అతిలోక సుందరి’ మరియు ‘మగధీర’ లాగా పునర్జన్మలు మరియు సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. మొత్తంగా కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో మునుపెన్నడూ చేయనటు వంటి చాలెంజింగ్ పాత్రను ‘బింబిసార’లో చేసినట్టు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న సందర్భంగా చిత్ర బృందం మరియు కళ్యాణ్ రామ్ సమక్షంలో కలిసి స్పెషల్ ప్రీమియర్ షో ప్రదర్శించాట. ఈ ప్రీమియర్ షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు అగ్ర నిర్మాత, పంపిణీదారుడు అయిన దిల్ రాజు కూడా బింబిసార చిత్రాన్ని తిలకించారట. వారివురికీ సినిమా బాగా నచ్చిందట. అంతే కాక సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నారట. ఈ వార్తల్లో నిజం ఉంటే అది అటు ప్రేక్షకులకు ఇటు ఇండస్ట్రీ వర్గాలు అనందమే అని చెప్పాలి.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నారు. ఇక ఈ మధ్య సినిమా ట్రైలర్ విడుదలై మంచి ఆదరణ పొందింది. ‘ ఎంత మంచి వాడవురా’ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తోన్న సినిమా ‘బింబిసార’. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు.