ఇటీవలే జల్సా సినిమా రీ-రిలీజ్ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు.. త్వరలోనే మరో పవర్ స్టార్ సినిమాని రీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. తాజా నివేదికల ప్రకారం, పవన్ కళ్యాణ్ నటించిన రొమాంటిక్ బ్లాక్ బస్టర్ ఖుషి సినిమాని మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 31న భారీ స్క్రీన్లలో ఈ రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా మళ్లీ విడుదలై సంచలనం సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాకు నిర్మాత అయిన ఏ ఎం రత్నం యే ఖుషి సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరించారు. ఆ రకంగా రెండు చిత్రాలను కూడా ఏ ఎం రత్నం నిర్మిస్తున్నందున హరి హర వీరమల్లు సినిమా నుంచి టీజర్ లేదా విడియో గ్లింప్స్ వంటి ప్రచార కంటెంట్ కూడా ఖుషి రీ రిలీజ్ సందర్భంగా జోడించబడే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత క్రేజ్ ఉన్న చిత్రంగా ఖుషి సినిమాని పేర్కొనవచ్చు. అందువల్లే దాని రీ-రిలీజ్ ఖచ్చితంగా జల్సా రీ రిలీజ్ కంటే గొప్ప స్థాయిని అందుకుంటుంది. ఇక ఈ రీ రిలీజ్ కి సంభందించిన మరిన్ని మరిన్ని అప్‌డేట్‌ల పైనే పవన్ అభిమానుల దృష్టంతా కేంద్రీకరించి ఉన్నారు. ఖచ్చితంగా ఖుషి సినిమా రీ రిలీజ్ లో.. స్పెషల్ షోలలో ఉన్న రికార్డులని తిరగరాసే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, హరి హర వీరమల్లు చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు క్రిష్ ఈ సినిమాని వీలయినంత త్వరలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. హరి హర వీరమల్లు అనేది ప్యాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్. కాగా ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం మరియు హిందీ భాషలో కూడా విడుదల కానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో పవన్ కళ్యాణ్ సరసన కధానాయికగా నిధి అగర్వాల్ కనిపించనున్నారు.