సమంత రుత్ ప్రభు నటించిన పాన్ ఇండియా చిత్రం శాకుంతలం వరుసగా సమస్యలను ఎదుర్కొంటోంది. మొదట ఈ సినిమాను ఫిబ్రవరి 17న విడుదల చేయాలనుకున్నారు కానీ ఏప్రిల్ 14కి వాయిదా పడింది. ఇది చాలా మంచి డేట్ అని అందరూ అనుకున్నారు కానీ తాజాగా ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టు ముట్టడంతో ఈ సినిమాను సమస్యలు ఇప్పట్లో వదిలిపెట్టే పరిస్థితి కనిపించడం లేదు.
ఈ సినిమాను మొదట 40 – 50 కోట్ల మధ్య బడ్జెట్ తో ప్లాన్ చేశారు కానీ షూటింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్ పనుల్లో జాప్యం, మరికొన్ని నిర్మాణ ఖర్చులతో ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు 75 కోట్లకు పై గానే అయిందని.. అయితే అదే రేంజ్ లో బిజినెస్ జరగడం లేదని అంటున్నారు.
పోస్టర్లు, టీజర్, ట్రైలర్ లతో బజ్ క్రియేట్ చేయడంలో ఈ సినిమా ఎందుకో ఫెయిల్ అవుతూ ఉండటం కూడా సినిమా హైప్ పై నెగిటివ్ గా ప్రభావం చూపింది. ఇతర భాషల్లో కూడా పెద్దగా క్రేజ్ లేకపోవడంతో థియేట్రికల్ ఆఫర్లు దాదాపు శూన్యం అనే చెప్పాలి. తెలుగులో శాకుంతలం సినిమాకు మంచి క్రేజ్ ఉన్నా ఆఫర్లు మాత్రం చాలా వరకు ఓ మోస్తరు స్థాయిలోనే ఉన్నాయి.
తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ బిజినెస్ దాదాపు 20 కోట్లకు దగ్గరగా ఉంటుందని, నాన్ థియేట్రికల్స్ నుండి 50 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో రాబట్టలేకపోవచ్చు అని అంటున్నారు. కాబట్టి ఈ సినిమా ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని, రాబోయే రోజుల్లో సరైన ప్రమోషనల్ కంటెంట్ తో భారీ బజ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చిత్ర బృందం భావిస్తోంది.
సమంత నటించిన శాకుంతలం చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దుష్యంత రాజు పాత్రలో దేవ్ మోహన్ నటిస్తుండగా, ప్రిన్స్ భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటిస్తోంది. ఈ చిత్రం ప్రసిద్ధ నాటకం శాకుంతలం ఆధారంగా రూపొందించబడింది. గుణ టీమ్ వర్క్స్ పతాకం పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. అదితి బాలన్, ప్రకాష్ రాజ్, గౌతమి, మధూ, సచిన్ ఖేడేకర్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.