ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 యొక్క ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో భారీగా తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడు. కాగా ఆ విషయం తెలుసుకున్న అనంతరం వారికీ రూ. 25 లక్షల పరిహారం ప్రకటించారు అల్లు అర్జున్.
కాగా ఆ దుర్ఘటన విషయమై అటు సంధ్య థియేటర్ పై అలానే అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తరువాత ఆయనని అరెస్ట్ చేసారు. అయితే 13 గంటలు జైల్లో ఉన్న అల్లు అర్జున్ అనంతరం నాంపల్లి కోర్ట్ నుండి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు. కాగా ఆ ఘటన పై నేడు తెలంగాణ అసెంబ్లీ లో ఒకింత నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయన మాట్లాడుతూ కేవలం 13 గంటలు ఒక సెలబ్రిటీ జైల్లో ఉంటె అదేదో ఆయనకు యాక్సిడెంట్ అయి కాలో చెయ్యో విరిగినట్లు ఆయనని పరామర్శించేందుకు పలువురు సినిమా ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కట్టి వెళ్లడాన్ని ఆయన పూర్తిగా తప్పుబట్టారు.
అలానే మృత్యువాత పడిన రేవతి కుటుంబాన్ని కానీ ప్రస్తుతం విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ని కానీ ఒక్కరు కూడా పరామర్శించకపోవడం విచారకరం అన్నారు. అందుకే ఇకపై ఇటువంటి దుర్ఘటనలు జరుగకుండా తెలంగాణలో సినిమాల యొక్క బెనిఫిట్ షోస్ తో పాటు టికెట్స్ పెంపు ఉండదని, తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అది జరుగదని అన్నారు.