టాలీవుడ్ నటుడు బండ్ల గణేష్ హాస్యనటుడిగా కెరీర్ ప్రారంభించి, చాలా సంవత్సరాల పాటు చిన్న పాత్రల్లో నటించిన తరువాత నిర్మాతగా మారి అనేక సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఇక ఆడియో ఫంక్షన్లలో పాల్గొని వివాదాస్పద, హాస్యాస్పద స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా బండ్ల గణేష్ మరింత పాపులర్ అయ్యారు.
బండ్ల గణేష్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాల ఆడియో ఫంక్షన్లలో కనిపించి మరింత ఫేమస్ అయ్యారు. పవన్ ను విపరీతంగా పొగడటం ద్వారా అతను హైలైట్ అయ్యారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ ఫెయిల్ అయిన విషయం కూడా మనకు తెలుసు. ప్రస్తుతం ఆయన ట్విట్టర్ లో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇక తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పరోక్షంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన బండ్ల గణేష్ మరోసారి మరో వివాదానికి తెరలేపాడు. పవన్ ప్రతిభను చాలా కాలం క్రితమే గుర్తించానని బండ్ల గణేష్ తెలిపారు. పవన్ సామాన్యుడు కాదని తనకు ముందే తెలుసునని బండ్ల గణేష్ అన్నారు. ఇప్పుడు గురూజీ (పరోక్షంగా త్రివిక్రమ్ పై సెటైర్ వేస్తూ) అని ప్రజలు వేరొకరిని పిలుస్తున్నారని ఆయన అన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య మంచి అనుబంధం ఉందన్న విషయం మనకు తెలిసిందే. సినిమాల కోసం పవన్ ను సంప్రదించాలనుకునే వారు సాధారణంగా త్రివిక్రమ్ ద్వారా వెళ్లి పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేసే అవకాశం పొందుతారు.
అప్పట్లో త్రివిక్రమ్, బండ్ల గణేష్ కూడా చాలా క్లోజ్ గా ఉండేవారు. ఈ విషయాన్ని బండ్ల గణేష్ స్వయంగా వెల్లడించి త్రివిక్రమ్ తనకు చాలా దగ్గరయ్యాడని చెప్పారు.
అయితే పవన్ కోసం సినిమాలను సెట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న త్రివిక్రమ్ తనకు అవకాశం ఇవ్వడం లేదని బండ్ల గణేష్ భావించిన దగ్గరి నుండి వారిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. గతంలో ఒకసారి పవన్ అభిమానితో ఫోన్లో మాట్లాడిన బండ్ల గణేష్ ఆ సందర్భంగా త్రివిక్రమ్ ను తిట్టడం జరిగింది.
ఆ ఆడియో క్లిప్ తనదేనని బండ్ల గణేష్ ఒప్పుకున్నారు. అంతే కాకుండా త్రివిక్రమ్ తో అదే విషయమై క్షమాపణ చెప్పగా, అందుకు త్రివిక్రమ్ కూడా ఒప్పుకున్నారని ఆయన తెలిపారు. మరి ఈ తాజా వివాదం ఎక్కడకి దారి తీస్తుందో చూడాలి.