ఈ సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ తన ట్రేడ్ మార్క్ ఫ్యాక్షన్ లీడర్ పాత్రలో వీరసింహారెడ్డితో హిట్ కొట్టారు. అంతే కాకుండా వీరసింహారెడ్డి ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కావడంతో నిన్న రాత్రి చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ కు దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథులలో ఒకరిగా హాజరయ్యారు.
అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాని బాలయ్యతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు.
రాయలసీమ ప్రాంత నేపథ్యంలో తెరకెక్కిన గత చిత్రాలకు భిన్నంగా బాలయ్యతో తన సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని అనిల్ రావిపూడి ఖరారు చేశారు. ఫ్యాక్షనిస్ట్ పాత్రలు చేయడంలో బాలకృష్ణ దిట్ట అని, ఆ పాత్రల్లో నటించగా ఆయన కెరీర్ లో ఎన్నో హిట్స్ ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే.
షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రామ్ సి.ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తొలిసారి నందమూరి బాలకృష్ణతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్న అనిల్ రావిపూడి ఆయన కోసం ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం.
కాగా ఈ సినిమాలో యువ నటి శ్రీ లీల బాలకృష్ణ కూతురిగా నటిస్తుండగా.. మరో హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయని, ఫన్ ఎలిమెంట్స్ తక్కువగా ఉంటాయని సమాచారం.
దర్శకుడు అనిల్ రావిపూడి చక్కగా కామెడీ పండిస్తారని ఇమేజ్ ను తెచ్చుకున్నప్పటికీ బాలయ్యతో ఆయన చేసే సినిమా మాత్రం సీరియస్ ఓరియంటేషన్ తో ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.