ఇటీవల ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఆయన విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. తెలుగు సినీ ప్రముఖ నటుడు అయిన నాగార్జున తండ్రి, నటులు నాగచైతన్య, అఖిల్ అక్కినేనిల తాతయ్య అయిన లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు గురించి బాలకృష్ణ తప్పుగా మాట్లాడారు.
బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు అక్కినేని అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులకు కూడా నచ్చలేదు. ఏఎన్నార్ పై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను వారందరూ తప్పుబట్టారు.
ఈ కామెంట్స్ అక్కినేని ఫ్యామిలీకి చెందిన యువ హీరోలకు కూడా రుచించకపోవడంతో నాగచైతన్య, అఖిల్ అక్కినేని తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య మాట్లాడుతూ తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ కు ఆ రంగారావు (ఎస్వీ రంగారావును ఉద్దేశిస్తూ), అక్కినేని, తొక్కినేని, మరి కొందరు సమకాలీకులు ఉండేవారని చెప్పారు.
ఆయన వ్యాఖ్యల పై రచ్చ జరిగి మూడు రోజులవుతున్నా.. బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని లేదా అధికారికంగా స్పందించాలని అక్కినేని అభిమానులు, సాధారణ ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నా కూడా ఆయన ఇంకా మౌనం పాటించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడు తన పై వస్తున్న విమర్శల పై ఆయన స్పందిస్తారో లేదో వేచి చూడాలి మరి.