ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవతార్ 1’ రెండో భాగం ‘అవతార్ 2’ విడుదలకు సిద్ధమవుతోంది. దీనికి ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా పై అంచనాలు అసాధారణంగా ఉన్నాయి. ఇండియాలో కూడా ఈ సినిమా భారీ విజయం సాధించడం ఖాయమని, మన దేశంలో కూడా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.
జేమ్స్ కామెరూన్ వరుస ఇంటర్వ్యూలతో ప్రచారం చేస్తున్న ఈ చిత్రం ఈసారి 3డి టెక్నాలజీతో మరింత విజువల్ ట్రీట్ ను అందించే విధంగా రూపొందించబడింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సినిమా యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
అవతార్ 2 డిసెంబర్ 16 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పుడు ఇండియాలో కూడా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
192 నిమిషాల 10 సెకండ్ల నిడివితో ఈ సినిమా తెరకెక్కింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మొదటి భాగం కంటే చాలా ఎక్కువ అని చెప్పక తప్పదు. మూడు గంటలకు పైగా ప్రేక్షకులను అలరించాలి అంటే సినిమా కంటెంట్ ఎంతో అద్భుతంగా ఉండాల్సిందే. విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీ స్థాయిలో ఉండాలి.
సాధారణంగా హాలీవుడ్ సినిమాల రన్ టైమ్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ అవతార్ సినిమా చాలా ప్రత్యేకమైనది, దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రేక్షకులను మూడు గంటలకు పైగా థియేటర్లలో కట్టిపడేయాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది.
అవతార్ మొదటి భాగం 162 నిమిషాల నిడివి కలిగి ఉంది. అవతార్ 2 సక్సెస్ అయితే పార్ట్ 5 వరకు మరిన్ని కథలు వస్తాయని జేమ్స్ కామెరూన్ ఇప్పటికే స్పష్టం చేశారు.
ఇండియాలో కూడా అవతార్ 2 భారీ బిజినెస్ చేయబోతోంది. ఒక్క తెలుగులోనే ఈ సినిమా 100 కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం భారతదేశంలో ఏకంగా 500 కోట్ల మధ్య వసూలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని బాక్సాఫీస్ పండితులు భావిస్తున్నారు. మరి అంచనాలను అందుకుని అన్ని రకాలుగా అవతార్ 2 ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆశిద్దాం.