ప్రేక్షకుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సూపర్ హిట్ సినిమా కాంతార ఓటిటిలో విడుదల అయింది. కాంతార స్ట్రీమింగ్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా నవంబర్ మొదటి వారంలోనే స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి రావడానికి సిద్ధంగా ఉన్నా.. థియేటర్లలో అనూహ్యంగా రన్ అవడంతో అది వాయిదా వేయవలసి వచ్చింది.
పైన చెప్పినట్లుగా, కాంతార యొక్క OTT విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ తీరా సినిమా చూసిన తర్వాత నిరాశ చెందారు. వారు అలా నిరాశ చెందడానికి సరైన కారణం ఉండనే ఉంది.
కాంతార క్లైమాక్స్‌లో వరాహ రూపం పాట అత్యంత ప్రసిద్ధి చెందిన పాట మరియు సినిమాకే ఉత్తమ పాయింట్ అని మనందరికీ తెలుసు. చిత్రం చివరలో ఉత్కంఠభరితమైన యాక్షన్ ఎపిసోడ్ తర్వాత, వరాహ రూపం పాట ప్రేక్షకులకు సంతృప్తికరమైన దివ్య అనుభూతిని ఇస్తుంది.
కానీ OTTలో, చిత్ర బృందం ఈ పాటను తీసివేసి, దాని స్థానంలో మరొక పాటను చేర్చింది. ఈ మార్పుతో ప్రేక్షకులు పూర్తిగా నిరాశ చెందారు. సినిమా తాలూకు ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో తైక్కుడం బ్రిడ్జ్ ‘వరాహ రూపం…’ పాట ఆర్కెస్ట్రా ఏర్పాటులో కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తమ పాత ‘నవరసం’ ను కాపీ కొట్టారని ఆరోపణలు చేశారు. ‘కాంతార’ సంగీత దర్శకుడు దీనిని తిరస్కరించారు మరియు తాము ‘నవరసం’ నుండి కేవలం ప్రేరణ మాత్రమే పొందామని తెలియజేసినప్పటికీ, తైక్కుడం బ్రిడ్జ్ ఆ వాదనలను తిరస్కరించింది.
ఆ తర్వాత కన్నడ హిట్ ‘కాంతార’పై మ్యూజిక్ బ్యాండ్ తైక్కుడం బ్రిడ్జ్ లేవనెత్తిన కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలపై కోజికోడ్ ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు జోక్యం చేసుకుంది. ‘కాంతార’ సినిమాలోని ‘వరాహ రూపం…’ పాటను ఫిర్యాదుదారుని అనుమతి లేకుండా ఉపయోగించరాదని కోర్టు ఆదేశించింది.
కాంతార దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడులను ఉద్దేశిస్తూ.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లైన Amazon, YouTube, Spotify, JioSaavn మరియు Wynk లలో వరాహ రూపం పాటను ఉపయోగించకుండా కోర్టు నిషేధించింది.
కాంతార థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతే కాక ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మరో వైపు ఈ సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న తరుణంలో.. ఈ సినిమాను అంత తొందరగా ప్రైమ్‌కి తీసుకొచ్చే అవకాశం లేదని చాలా మంది భావించారు. అందుకే అమెజాన్ కూడా ముందుగా OTT విడుదల తేదీ నుండి 3 వారాల పాటు వేచి ఉంది.
ఈ సినిమా నేరుగా ప్రసారం అవుతుందా లేక అద్దె ప్రాతిపదికన ప్రసారం అవుతుందా అనే సందేహం ప్రేక్షకుల్లో నెలకొని ఉండింది. కానీ కాంతార ఎటువంటి పరిమితులు లేకుండా చందాదారులందరికీ నేరుగా అందుబాటులోకి వచ్చింది. నాలుగేళ్ళ కిందట ఒక హిట్ సినిమాని నేరుగా ప్రసారం చేయకుండా కొంత మొత్తంలో అద్దె వసూలు చేసే పద్ధతిని అమెజాన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
కాగా కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కాంతార నిలిచింది. కేజీఎఫ్-2 సృష్టించిన కొన్ని రికార్డులను కూడా క్రాస్ చేసింది. ఆ తర్వాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. ఇక్కడ కూడా 60 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.