ఆస్కార్ అందుకున్న భారతీయ దిగ్గజ సంగీత దర్శకుడు ఏ ఆర్ రహమాన్ పేరు మన దేశంతో పాటు పలు ఇతర దేశాల్లో కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆ విధంగా తన ఆకట్టుకునే సంగీతంతో కోట్లాది ఆడియన్స్ యొక్క మనసులు దోచారు రహమాన్. ఇక ఆయన తెలుగులో కూడా పలు సినిమాలు చేసి ఇక్కడి ఆడియన్స్ యొక్క మనసు కూడా చూరగొన్నారు.
కాగా విషయం ఏమిటంటే, నేడు ఉదయం ఒకింత ఛాతి నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరారు రహమాన్. ఆయన అస్వస్థత విషయం తెలిసిన కుటుంబసభ్యులు వెంటనే ఆయనని చెన్నై లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆయనకి చికిత్స అందిస్తున్న వైద్యలు ప్రస్తుతం ప్రమాదమేమీ లేదని తెలిపారట.
ఈ విషయమై కొద్దిసేపటి క్రితం తమిళ నాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన ట్విట్టర్ వేదికగా రహమాన్ ఆరోగ్యం గురించి ఒక పోస్ట్ పెట్టారు. తాను కొద్దిసేపటి క్రితం ప్రత్యేకంగా ఆసుపత్రి వైద్యులతో మాట్లాడానని, రహమాన్ గారికి కొంత చికిత్స అందించిన అనంతరం ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని, అతి త్వరలోనే ఆయనని డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిపారని అన్నారు. కావున అభిమానులు, ప్రేక్షకులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.