ఏపీలో ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్ల విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అందుకోసం యువర్ స్క్రీన్స్ పేరిట ప్రత్యేక పోర్టల్ కూడా రూపొందించారు. దీనిపై ఏపీఎఫ్ డీసీ ఎండీ విజయ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు.
యువర్ స్క్రీన్స్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల అదనపు చార్జీల భారం ఉండదని వెల్లడించారు. యువర్ స్క్రీన్స్ పోర్టల్ వినియోగం ద్వారా బ్లాక్ టికెటింగ్ కు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. ప్రేక్షకులకు తక్కువ ధరలకే సినిమా టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆన్ లైన్ లో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే సినిమా టికెట్ల అమ్మకాలు జరుగుతాయని వివరించారు.
ఇతర పోర్టల్స్ కంటే రూ. 20 నుంచి రూ.25 రూపాయల తక్కువకే టికెట్లను విక్రయించనున్నారు.థియేటర్లకు కూడా ఏ రోజు డబ్బులను ఆరోజే ఇస్తామని ఏపీ సర్కార్ చెబుతోంది. ఇటు ఇతర పోర్టల్స్‌తోనూ ఒప్పందాలు కొనసాగించనుంది ప్రభుత్వం.
అయితే ఈ విధానం పై థియేటర్ల యాజమాన్యం అంత సుముఖంగా లేరు. ఇదివరకే బుక్ మై షో, పే టీయం వంటి సంస్థలతో థియేటర్లు ఒప్పందం కుదుర్చుకున్నాయి.ఆయా ఒప్పందాలు ఇంకా కొనసాగుతుండగా ఇప్పుడు అకస్మాత్తుగా ప్రభుత్వం ఈ కొత్త టికెటింగ్ పోర్టల్ ప్రారంభించడం అందులోనూ ఖచ్చితంగా అదే పోర్టల్ తో థియేటర్ వారు ఒప్పందం కుదుర్చుకోవలసిందే అని బలవంతం చేయడం ఏమాత్రం సరి కాదని థియేటర్ యాజమాన్యం వారు వాపోతున్నారు. ప్రభుత్వ ఇలాగే బెదిరింపు వైఖరి కొనసాగిస్తే థియేటర్లు మూసివేస్తాం అని తెలిపారు. ఏదేమైనా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలి అనుకుంటే ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఎక్జిబిటర్ లతో చర్చలు జరిపి ఆ పై నిర్ణయం తీసుకుంటే మంచిది.