ఆన్లైన్ సినిమా టికెట్ల విధానంపై ప్రభుత్వం మరియు ఎగ్జిబిటర్ల మధ్య సమస్య కొనసాగుతోంది.ఈ మేరకు కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మంత్రి వేణుగోపాల కృష్ణను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సినీ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిశారు.థియేటర్ల యాజమాన్యాలకు ఆన్ లైన్ టికెటింగ్ పై అవగాహన లేదని,అందుకే ఈ అపార్ధాలు వచ్చాయని మంత్రి వేణుగోపాల్ అన్నారు.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇటు ప్రజలకు అటు థియేటర్ యజమానులకు లాభమే తప్ప నష్టం జరగదని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఉన్న టికెటింగ్ పోర్టల్ లు బుక్ మై షో, పేటీఎంల వల్ల అందరికీ ఇబ్బంది కలుగుతోందని ఆయన చెప్పారు.అందుకే అటు ప్రజలు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా నిర్ణయం తీసుకుంటామని మంత్రి వేణుగోపాల కృష్ణ చెప్పారు.డిస్ట్రిబ్యూటర్ల సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించడంతో రేపటి నుంచి థియేటర్లు మూసేయాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు డిస్ట్రిబ్యూటర్లు.
ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్ల బుకింగ్ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.అందుకోసం యువర్ స్క్రీన్స్ పేరిట ప్రత్యేక పోర్టల్ కూడా రూపొందించారు.యువర్ స్క్రీన్స్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల అదనపు చార్జీల భారం ఉండదని,అంతే కాక యువర్ స్క్రీన్స్ పోర్టల్ వినియోగం ద్వారా బ్లాక్ టికెటింగ్ కు అడ్డుకట్ట వేయవచ్చు అని తెలిపారు.
ప్రేక్షకులకు తక్కువ ధరలకే సినిమా టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆన్ లైన్ లో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే సినిమా టికెట్ల అమ్మకాలు జరుగుతాయని అధికారులు వివరించారు.
ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్ లో అమలు చేయాలని, అందుకు ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా వినోదాన్ని అందించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అధికారులు వెల్లడించారు.ఎలాంటి ఇబ్బందీ లేకుండా అటు ఇండస్ట్రీ ఇటు డిస్ట్రిబ్యూటర్స్ ఆనందంగా ఉండేలా ఈ సమస్య మళ్ళీ పునరావృతం అవ్వకూడదు అని కోరుకుందాం.