అనుదీప్ కెవి పిట్టగోడ అనే సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యారు. మొదటి సినిమాతో తాను అనుకున్న సక్సెస్ సాధించలేకపోయినా.. మరో దర్శకుడైన నాగ్ అశ్విన్ అనుదీప్‌ని ప్రోత్సహించి వెంటనే మరో సినిమాకు అవకాశం ఇవ్వాలనుకున్నారు.
అలా అనుదీప్ తో ‘జాతి రత్నాలు’ మొదలైంది. నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అనూహ్యంగా భారీ విజయం సాధించడంతో అనుదీప్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు.
ఇక ఆ తర్వాత తమిళ హీరో శివ కార్తికేయన్‌తో కలిసి సినిమాని తెరకెక్కించే అవకాశం దక్కించుకున్న అనుదీప్ ప్రిన్స్ అనే సినిమా చేశారు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయింది.
సాధారణంగా ఒక చిన్న దర్శకుడు తీసిన సినిమా గనక డిజాస్టర్ అయితే ఆ సినిమా చేసిన వెంటనే తర్వాత రాబోయే ప్రాజెక్ట్‌లు అన్నీ క్యాన్సిల్ అవుతాయి. కానీ అనుదీప్ విషయంలో అలా జరగలేదు. కాగా ప్రిన్స్ వైఫల్యం తన కెరీర్ ను ప్రభావితం చేయడం లేదు.
ఇటీవల తన తాజా చిత్రం ప్రిన్స్‌తో డిజాస్టర్ అందుకున్నా.. దర్శకుడిగా అనుదీప్ కి ఇప్పటికీ క్రేజ్ ఉంది. దాదాపు టైర్-2 హీరోలందరూ ఇప్పటికీ అనుదీప్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
తాజా వార్తల ప్రకారం అనుదీప్ ఇప్పటికే కొంతమంది నిర్మాతల నుండి అడ్వాన్స్ తీసుకున్నారని తెలుస్తోంది. కాగా ఈ యువ దర్శకుడు తన తదుపరి ప్రాజెక్ట్ కోసం పని చేయడం ప్రారంభించారట. అంతే కాకుండా హీరో రామ్‌ని కలవడానికి ప్లాన్ చేస్తున్నారని, రామ్ కూడా అనుదీప్ తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
‘ప్రిన్స్’ సినిమాని సురేష్ బాబు మరియు సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మించగా తెరకెక్కిన ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. తమిళంలో రూపొందిన ఈ సినిమా తెలుగులోనూ విడుదలైంది.
ఇక ఈ సినిమాకు అవసరమైన మేరకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించలేదు. అంతే కాకుండా సినిమాలోని కంటెంట్ కూడా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. ‘జాతి రత్నాలు’ తరహాలోనే కామెడీ సన్నివేశాల ఫార్ములా ఉన్నందున ‘ప్రిన్స్’ సినిమాను ప్రేక్షకులు, విమర్శకులు ఏకగ్రీవంగా తిరస్కరించారు.
కొంతమంది దర్శకుడు అనుదీప్ కెవిని విమర్శిస్తూ, జాతిరత్నాలు యాదృచ్ఛికంగా హిట్ అయిన సినిమా అని అన్నారు. అయితే అనుదీప్ పై తెలుగు హీరోల నమ్మకాన్ని చూస్తుంటే, అతను తన తదుపరి సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది.