ఈ మధ్య కాలంలో నైజాం ఏరియాలో తమ సినిమాల హక్కులను దిల్ రాజుకు ఇవ్వడానికి చాలా మంది నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే వివిధ సినిమాలకు సంబంధించి దిల్ రాజు ఒక్కో రకంగా లెక్కలు వేయడం వల్ల నైజాం డిస్ట్రిబ్యూషన్ లో దిల్ రాజుతో డీల్ చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. తాజాగా మరో నిర్మాత కూడా ఈ లిస్ట్ లో చేరినట్లు తెలుస్తోంది.
అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న ఏజెంట్ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మరో డిస్ట్రిబ్యూటర్ ద్వారా సొంతంగా నైజాం ఏరియాలో విడుదల చేసే యోచనలో ఆయన ఉన్నారట. నిజానికి ఈ ఆఫర్ తమకు వస్తుందని దిల్ రాజు టీం భావించినా, అనిల్ సుంకర తన సినిమా హక్కులను దిల్ రాజుకు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదని, ఆ పని కోసం మరో డిస్ట్రిబ్యూటర్ కోసం వెతుకుతున్నారని సమాచారం అందుతోంది.
దిల్ రాజు తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగానే కాక నైజాంలో నెంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇతర నిర్మాణ సంస్థలు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రవేశించడంతో ఆయన పోటీ వేడిని చవిచూశారు. దీనికి ప్రధాన కారణం నిబంధనలను బట్టి ఒక్కో సినిమాకు దిల్ రాజు రకరకాల లెక్కలు వేసుకోవడమే అంటున్నారు.
అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం దిల్ రాజు ఒక సినిమాను నిర్మిస్తే ఎలాగూ తానే పంపిణీదారుడుగా ఉంటారు కనుక నైజాం కలెక్షన్స్ లో రికార్డ్ లెక్కలు చూపిస్తారట. అదే పాలసీని తాను ఒక సినిమాని భారీ మొత్తానికి కొనుక్కుంటే కూడా పాటిస్తారట. అయితే దిల్ రాజు ఫలానా సినిమా లాభాలను మరో నిర్మాతతో పంచుకోవాల్సి వస్తే మాత్రం ఆ సినిమాకు కలెక్షన్ల లెక్కలు వేరుగా ఉంటాయట.
దిల్ రాజు లాభాలను నిర్మాతతో పంచుకోవాల్సి వస్తే కలెక్షన్లను తక్కువ సంఖ్యలో చూపిస్తారని అయన పై ఫిర్యాదులు అందాయి. పైగా ఆయన కమీషన్ ప్రాతిపదికన సినిమా విడుదల చేస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని, అనేక కారణాలను చూపుతూ సినిమాకి చాలా తక్కువ అంకెలు చూపిస్తారని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.
పైన పేర్కొన్న కారణాల వల్ల మొదట మైత్రీ మూవీస్ వంటి బడా నిర్మాణ సంస్థ దిల్ రాజును వ్యతిరేకించగా, తాజాగా అనిల్ సుంకర ఈ జాబితాలో చేరారు. ఇప్పుడు ఇంకెంత మంది నిర్మాతలు ఈ బాట పడతారో వేచి చూడాల్సిందే.