యువ సంగీత కెరటం అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం తన కెరీర్ లోనే ఉత్తమ దశలో ఉన్నారు. ఈ ఏడాదిలో, తమిళ సినిమాలైన విక్రమ్, డాన్, బీస్ట్, K2K సినిమాలకు అందించిన పాటలు చార్ట్ బస్టర్ లు అయ్యాయి. కేవలం పాటలే కాకుండా నేపథ్య సంగీతంలోనూ తనదైన ప్రత్యేక గుర్తింపును పొందారు. ముఖ్యంగా విక్రమ్ సినిమాకి హాలీవుడ్ తరహాలో ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల చేత విశేషమైన స్పందన రాబట్టింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాతో అనిరుధ్ తెలుగు సినిమా పరిశ్రమ లోకి అడుగు పెట్టారు. ఆ చిత్రం ఘోరంగా పరాజయం చెందడంతో త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమా నుంచి ఆయనని తొలగించారు. ఆ తరువాత జెర్సీ, గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలకు సంగీతం అందించి ఆకట్టుకున్నారు.
ప్రస్తుతం అనిరుధ్ ఎన్టీఆర్ 30వ సినిమాకి పని చేస్తున్నారు. ఆ సినిమాకి సంభందించిన అనౌన్స్ మెంట్ టీజర్ కి ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు విపరీతమైన ఆదరణ దక్కింది. ఇదిలా ఉండగా అనిరుధ్ మరో ప్యాన్ ఇండియా సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు.
ఆ సినిమా మరేదో కాదు రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వస్తున్న పాన్-ఇండియా చిత్రం. ఈ చిత్రం ఏడాది చివరలో అంటే డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం, రామ్ చరణ్ శంకర్ తో RC 15 తో బిజీగా ఉన్నారు. యాభై శాతం షూటింగ్ జరుపుకున్న ఆ సినిమాని త్వరగా ముగించి గౌతమ్ తో చేసే సినిమాను ప్రారంభించాలని చూస్తున్నారు.
ఇదిలా ఉంటే, గౌతమ్, అనిరుధ్ కలిసి నటించడం ఇది రెండోసారి. 2019 సూపర్‌హిట్ జెర్సీకి ఈ ప్రతిభావంతుడైన దర్శకుడు మరియు యువ సంగీత దర్శకుడు కలిసి పనిచేశారు. జెర్సీ సినిమాకి అనిరుధ్ ఇచ్చిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ప్రశంసించబడ్డాయి. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆ సినిమా విజయంలో అనిరుధ్ సంగీతం కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రామ్ చరణ్ – గౌతమ్ తిన్ననూరి సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. అలాగే ఈ సినిమాతో రామ్ చరణ్ మరియు అనిరుధ్ కలిసి చేస్తున్న మొదటి సినిమా. 2015 లో రామ్ చరణ్ – శ్రీను వైట్ల కలయికలో వచ్చిన బ్రూస్లీ చిత్రానికి అనిరుధ్ పని చేయాల్సింది. కానీ కోన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఇక గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ చేయబోయే సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.