యాంకర్ అనసూయకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో బుల్లితెర పై కొన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. కేవలం తన యాంకరింగ్ వల్లే కాక పలు మార్లు తన మాటల ద్వారా,సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ ల ద్వారా కాస్త వివాదాస్పద సంఘటనలు ఆవిడ కెరీర్ లో ఎదురైనా..బెదరకుండా ఆయా పరిస్థితులని ధీటుగా ఎదురుకుని శభాష్ అనిపించుకున్నారు.
ఇదిలా ఉండగా అనసూయ టెలివిజన్ కెరీర్ ముగిసిపోనుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా జబర్దస్త్ నుంచి అనసూయ తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక పై ఆమె జబర్దస్త్‌లో కనిపించబోదని తెలుస్తోంది. అనసూయ గతంలో జబర్దస్త్ తో పాటు పలు టీవీ ప్రోగ్రామ్‌లలో కూడా కనిపిస్తూ ఉండేవారు. కాగా ప్రస్తుతం ఓ రెండు టీవీ షోల్లో మాత్రమే కనిపించడానికి కారణం ఇక బుల్లితెరకు టాటా చెప్పేసి పూర్తిగా సినిమాలపై, దృష్టి సారించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
అనసూయకు మొదటి నుంచీ సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ప్రత్యేక పాటలు,ప్రత్యేక పాత్రలే కాక తను ప్రధాన పాత్రలో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో ఆవిడ నటనకు ఎంతో పేరు వచ్చింది. అలాగే క్షణం,పుష్ప సినిమాల్లో విలన్ పాత్రల్లో కనిపించి మెప్పించారు.ఇతర భాషలలో కూడా అనసూయ నటించడం జరిగింది. మలయాళం లో అగ్ర హీరో మమ్ముట్టి సరసన భీష్మపర్వం సినిమాలో నటించిన అనసూయకు మరో మలయాళ సినిమాతో పాటు రెండు తమిళ చిత్రాల్లోనూ నటించే అవకాశం దక్కిందట.ఇక పుష్ప2లో కూడా తన పాత్రకి మంచి ప్రాముఖ్యత ఉందని తెలుస్తోంది.
కృష్ణవంశీ దర్శకత్వంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “రంగమార్తాండ” చిత్రంలోనూ ఒక పాత్రలో నటిస్తున్న అనసూయ,ఆ తరువాత మరోసారి ప్రధాన పాత్రలో ఒక వెబ్ సిరీస్ చేయనున్నారని సమాచారం. అందులో ఒక వేశ్య పాత్రలో నటిస్తున్నారు అని వినికిడి.
‘కన్యాశుల్కం’ నాటకం అప్పటి బాల్యవివాహాలు .. వితంతు వివాహాలతో పాటు ఇతర మూడాఛారాలు ఆనాటి సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేశాయనేది చాటి చెబుతుంది. ఈ వెబ్ సిరీస్ ను దర్శకుడు క్రిష్ సారథ్యం వహిస్తున్నారు అని సమాచారం. 1955లో నందమూరి తారకరామారావు గారు,మహానటి సావిత్రి కలిసి నటించిన ‘కన్యాశుల్కం’ సినిమాను నేటికీ ప్రేక్షకులు,విమర్శకులు ప్రశంసిస్తూ ఉంటారు. మరి అనసూయ, క్రిష్ అలనాటి క్లాసిక్ ను మరిపించేలా చేయగలరో లేదో చూద్దాం.