కొద్ది రోజుల క్రితం తెలుగు హీరో జూ.ఎన్టీఆర్ మరియు బీజేపీ హోంమంత్రి అమిత్ షా సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి ఉన్న మరియు చర్చలు జరుపుకున్నట్లుగా ఉన్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సమావేశం ముగిసిన తర్వాత ఈ భేటీపై అందరిలోనూ అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అమిత్ షా జూ.ఎన్టీఆర్‌ని పిలవడం వెనుక రాజకీయ కోణం ఉందని, ఏదో రహస్య వ్యూహరచన చర్చకు ఆయనను ఆహ్వానించారని అనుకున్నారు. జూ.ఎన్టీఆర్ కు రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్, హరికృష్ణ మరియు బాలకృష్ణ ఇలా ఆయన కుటుంబంలో అందరూ రాజకీయాల్లోకి నిష్ణాతులుగా ఉన్నారు. ఇక సీనీయర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు.
దీంతో జూ.ఎన్టీఆర్ ను బీజేపీ పార్టీలోకి తీసుకురావడానికే అమిత్ షా ఎన్టీఆర్ తో సమావేశం జరిపారని చాలా మంది ప్రజలు కూడా నమ్మారు. అయితే తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనని, తన దృష్టి అంతా కేవలం సినిమాలపైనే ఉంటుందని ఇదివరకే జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో సార్లు స్పష్టం చేస్తూ వచ్చారు.
తాజాగా ఇదే విషయాన్ని తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ అయిన బండి సంజయ్ కూడా తీవ్రంగా ఖండించారు. ఎన్టీఆర్ – అమిత్ షా ల సమావేశం ఎంతమాత్రం రాజకీయ ఉద్దేశంతో చేసినది కాదని స్పష్టం చేశారు. అమిత్ షా ఎన్టీఆర్ ను కలిసింది అభినందనపూర్వకంగానే అని, ఎందుకంటే ఎన్టీఆర్ నటనకు అమిత్ షా అభిమాని అని, ఆయన ఎన్టీఆర్ నటించిన సినిమాలను ఇష్టపడతారని.. అందుకే వారిద్దరి మధ్య జరిగిన చర్చ కూడా కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం చేయబడిందని బండి సంజయ్ తెలిపారు.
సినిమాలు – రాజకీయాలు అనేవి రెండూ వేర్వేరు రంగాలు అయినప్పటికీ.. సినిమా పరిశ్రమ నుంచి హీరోలు, నటులు లేదా నిర్మాతలు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేశారు. అలాగే ముఖ్యమంత్రి అయిన తరువాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ప్రస్తుతం హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ ఇలా పదవుల్లో ఉంటూనే సినిమాల్లో కూడా పని చేశారు. అలాంటి రాజకీయ – సినీ రంగ మిళితమైన కుటుంబంలో ఉన్నందున ఒక్కోసారి తన ప్రమేయం ఏమీ లేకపోయినా ఎన్టీఆర్ ఇలా రాజకీయ వివాదాలు లేదా చిన్న పాటి పుకార్లలో భాగం అవుతూ ఉంటారు.